Khammam News: ఖమ్మం నగరం తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం.. రియల్‌ ఎస్టేట్‌తోపాటు విద్యా, వైద్య రంగాలలో కార్పోరేట్‌ స్థాయిలో అబివృద్ధి చెందిన ఖమ్మం నగరంలో కల్చర్‌ కూడా మారుతుంది. నగరంలో డ్రగ్స్‌ పట్టివేతతో నగరంలో కొత్త అలవాట్లు మొదలయ్యాయా..? అనేది చర్చానీయాంశంగా మారింది. 


హైదరాబాద్‌ తరువాత అత్యంత వేగంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం పెరిగిపోయింది. తెలంగాణలో ఎక్కువగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగే నగరం ఖమ్మం కావడం గమనార్హం. దీంతోపాటు వైద్య రంగంలో కూడా అత్యంత తక్కువకాలంలో అభివృద్ధి చెందింది. ఉమ్మడి ఖమ్మంతోపాటు వరంగల్, నల్గొండ, సూర్యాపేట ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం ఇక్కడికే వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ వైపు అభివృద్ధితోపాటు అలవాట్లు కూడా మారుతున్నట్లు కనిపిస్తోంది. పెరుగుతున్న కల్చర్‌ను అలవాటు చేసుకోవడంతోపాటు యువత పెడదోవ పట్టినట్లు కనిపిస్తోంది. ఖమ్మం నగరంలో 1600 గ్రాముల గంజాయి, 10 గ్రాముల ఎన్‌డీఎంఎ, 10 గ్రాముల లిక్విడ్‌ గంజాయిని ఎక్సైజ్‌ అధికారులు పట్టుకోవడం కలకలం రేగింది. ఇప్పటి వరకు అడపాదడపా కేవలం గంజాయిని మాత్రమే పట్టుకున్న పోలీసులు ఇప్పుడు ఎన్‌డీఎంఏ లాంటి డ్రగ్స్‌ను పట్టుకోవడం గమనార్హం. దీంతో డ్రగ్స్‌ కల్చర్‌ ఖమ్మంకు తాకుతుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పట్టుకున్న డ్రగ్స్‌ ఇతర నగరాలకు సరపరా చేసేందుకు ఖమ్మంను అడ్డాగా చేసుకున్నారని పోలీసులు చెబుతునప్పటికీ రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా ఆ సంస్కృతి పెరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. 


సక్రమంగా పనిచేయని నిఘా వ్యవస్థ..
ఖమ్మం నగరంలో రోజురోజుకు యువత పెడదోవ పట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో గంజాయి వాడకం కూడా పెరిగింది. అయితే హఠాత్తుగా డ్రగ్స్‌ కూడా దొరక్కడంతో కేవలం పెద్ద నగరాలకే ఇప్పటి వరకు పాకిన డ్రగ్స్‌ ఇప్పుడు ఖమ్మం నగరంకు కూడా పాకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో యువకులు కూడా దూకుడు పెంచారు. బుల్లెట్‌ బండ్లకు సౌండ్స్‌ ఏర్పాటు చేసుకుని రోడ్డుపై వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విషయంపై గతంలో పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చినప్పటికీ యువత తీరు మారడం లేదు. ప్రధానంగా నగర శివారు కేంద్రాలు గంజాయి వాడకానికి అడ్డాగా మారుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు నిఘా వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల నగరంలో యువత పెడదోవ పడుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో పూర్తిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి పూర్తిస్థాయి నాణ్యత లేన్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో ఇవి సక్రమంగా పనిచేయవని, కేవలం మద్యాహ్నం సమయంలో మాత్రమే పుటేజీ వచ్చే సామర్థ్యం ఉన్నవిగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం నగరంలో యువత పెడదోవ పట్టకుండా నిఘా పటిష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.