నెల్లూరు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. స్నేహ బంధానికి మాయని మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు.. ఓ యువకుడు. ఫలితంగా ఆ జంట ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సి వచ్చింది. స్నేహితుడి భార్యపై మోజుతో ఫ్రెండ్‌కి లేని చెడు అలవాట్లను అలవాటు చేసి తన కోరిక తీర్చుకున్నాడు. ఆమెపై మత్తు మందు ప్రయోగించి పలుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా నగ్న చిత్రాలు, వీడియోలు తీసి వాటిని ఇంటర్నెట్ లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులు, బెదిరింపులను తట్టుకోలేని భార్యాభర్తలు చివరికి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
భార్యాభర్తలు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నెల్లూరు జిల్లా లింగ సముద్రం మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. తన భర్తను తాగుడుకు బానిసయ్యేలా చేయడంతో పాటు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అందుకే ఇద్దరం కలిసి చనిపోవాలని అనుకున్నామంటూ ఓ మహిళ సూసైడ్ నోట్ రాసింది. అంతేకాక, ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను కూడా తీసుకున్నారు.
పోలీసుల వెల్లడించి వివరాల ప్రకారం.. ‘‘నేను, నా భర్త చావుకి కారణం షేక్ ఇలియాజ్. నా భర్తని మద్యానికి బానిసయ్యేలా అతని స్నేహితుడు ప్రోత్సహించాడు. ఆయన ద్వారా నాకు మత్తు మందు ఇచ్చి స్పృహ తప్పి పడిపోయిన తర్వాత పదే పదే అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసే సమయంలో అతని ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని ఇంటర్నెట్ లో పెడతానని బెదిరిస్తున్నాడు. మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అందుకే మేమిద్దరం చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా చావు తర్వాత అయినా అతడికి శిక్ష పడుతుందని కోరుకుంటున్నాం’’ అని బాధితురాలు ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో, సూసైడ్ సెల్ఫీ వీడియోలో పేర్కొంది.
ఆ తర్వాత దంపతులిద్దరూ విషం తాగారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ముందు భార్యాభర్తలు సెల్ఫీ వీడియో ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నిందితుడు వారిని ఎలా బ్లాక్ మెయిల్ చేసిందీ వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.