'ఏపీలో విక్రయిస్తున్న మద్యం తయారీ కంపెనీల యజమానుల పేర్లను ప్రజాక్షేత్రంలో పెట్టగలరా.?' అంటూ ఏపీ ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సవాల్ విసిరారు. దమ్ముంటే శనివారం సాయంత్రం కల్లా ఆ కంపెనీల యజమానుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వారంతా వైసీపీ వాళ్లేనని వేరే చెప్పాల్సిన అవసరం లేదని ధ్వజమెత్తారు. మద్యం తయారు చేసినా, అమ్మినా ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని గతంలో సీఎం జగన్ చెప్పినట్లు ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో మద్యంపై వైసీపీ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని విమర్శించారు. 


రాష్ట్రంలో నాసి రకం మద్యం


ఏపీలో 34.5 శాతం మంది మద్యం సేవిస్తున్నారని, డిజిటల్ పేమెంట్లను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించడం లేదని పురంధేశ్వరి విమర్శించారు. రోజుకు ఎంత మద్యం అమ్ముతున్నారు.? ఎంత మద్యం దాచి పెట్టారు.? వంటి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏపీలో నాసిరకం మద్యం ఏరులై పారుతోందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మద్యంపై జాతీయ సంస్థ (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) నివేదిక వివరాలను ఆమె బహిర్గతం చేశారు. 'మద్యంపై వైసీపీ ప్రభుత్వం చెబుతున్నవన్నీ కాకి లెక్కలు. మంత్రులు చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలు. రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది మద్యం సేవిస్తున్నారు.' అని పురంధేశ్వరి అన్నారు. కాగా, గత కొద్ది రోజులుగా ఏపీలో మద్యం విషయంలో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 


'చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదు'


స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో రిమాండులో ఉన్న ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారని పురంధేశ్వరి తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం లేదని ఆమె స్పష్టం చేశారు. FIRలో పేరు లేకపోయినా సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. ఆయన అవినీతికి పాల్పడ్డారా.? లేదా.? అనేది కోర్టు తేలుస్తుందని పేర్కొన్నారు. జైల్లో చంద్రబాబు భద్రతపై బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై సీఎం జగన్ సీబీఐ ఎంక్వైరీ వేయించుకుంటారా.? అని పురంధేశ్వరి ప్రశ్నించారు.