Makhana Kheer Recipe : పండుగ సమయంలో ప్రతి ఇంట్లో ఉండే డిజెర్ట్ ఖీర్. పండుగలతో సంబంధం లేకుండా ప్రతి ముఖ్యమైన రోజు కూడా దీనిని చేసుకునే ఫ్యామీలీస్ ఎన్నో ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు కలిగి ఉండే ఈ స్వీట్​ను పండుగల సమయంలో ప్రత్యేకంగా తయారు చేయాలనుకుంటే మఖానా ఖీర్ బెస్ట్. అసలు దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో? పండుగ సమయంలో మఖానా ఖీర్ ఎందుకు బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం. 


నవరాత్రి సమయంలో చాలా మంది ఉపవాసం ఉంటారు. ఆ సమయంలో తక్కువ కొవ్వు ఉండే ఆహారం తీసుకుంటే శరీరానికి మంచింది. ఎందుకంటే రోజంతా ఉపవాసం ఉండి అలసిపోయిన శరీరానికి ఒకేసారి ఎక్కువ తీపి, కొవ్వు కలిగిన ఫుడ్ తీసుకోవడం అంతమంచిది కాదు. పైగా చక్కెర ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకోవడానికి కొందరు ఇష్టపడరు. అలాంటివారికి మఖానా ఖీర్ బెస్ట్ ఆప్షన్. ఈ పండుగ సమయంలో రొటీన్ ఖీర్​కి బదులుగా మీరు మఖానా ఖీర్ తీసుకోవచ్చు.


మఖానాలు ఆరోగ్యంగా బరువు తగ్గడంలో చాలా ఉపయోగపడతాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి మినరల్స్, విటమిన్ బి, ఇ, కె వంటి విటమిన్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే దీనిని చాలామంది తమ డైట్​లో ఉండేలా చూసుకుంటారు. పైగా పండుగ సమయంలో స్వీట్స్ తినకుండా ఉండలేము కాబట్టి.. మఖానాతో ట్రై చేసిన ఖీర్​ని మీరు కచ్చితంగా ట్రై చేయవచ్చు. టేస్ట్, హెల్త్ రిచ్​ అయిన ఈ రెసిపీని అమ్మవారికి ప్రసాదంగా పెట్టవచ్చు. బంధుమిత్రులకు పండుగ సందర్భంగా పంచిపెట్టవచ్చు. ఈ స్వీట్​ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


పాలు - 1 లీటర్


మఖానా - పావు కప్పు


పంచదార - 2 టేబుల్ స్పూన్లు


పిస్తాపప్పులు - 2 టీస్పూన్లు


బాదం పప్పులు - 2 టీస్పూన్


ఏలకుల పొడి - 1 టీస్పూన్


తయారీ విధానం


ముందుగా మందపాటి గిన్నె తీసుకుని దానిలో పాలు పోయాలి. అది కాగుతున్నప్పుడు మఖానాలు చిన్న ముక్కలుగా కోసి పాలల్లో వేయాలి. అవి బాగా ఉడికేవరకు ఉంచాలి. పాలు బాగా మరిగి.. గింజలు మెత్తబడే వరకు మూత లేకుండా సుమారు ఉడకనివ్వండి. దానిలో చక్కెర వేసి బాగా తిప్పండి. దానిలో పిస్తాలు, బాదం, యాలకుల పొడి వేసి బాగా కలపండి. అంతే వేడి వేడి మఖానా ఖీర్ రెడీ. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత.. మీకు వేడిగా నచ్చితే వేడిగా.. లేదంటే చల్లగా కూడా తినొచ్చు. 


Also Read : హెల్తీ, టేస్టీ సగ్గుబియ్యం వడలు.. క్రిస్పీగా రావాలంటే ఇలా చేయండి..


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read : ఈ జ్యూస్​తో మొటిమలు దూరం.. మెరిసే అందం మీ సొంతం