కరోనా పరిస్థితుల దృష్ట్యా వినాయక చవితి వేడుకలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని ఏపీ సర్కార్ సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలపై ఆంక్షలు విధించింది. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ ఆదివారం కర్నూలులో నిరసన చేపట్టింది. ఈ నిరసనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాయంత్రం 4 గంటలకు నగరంలోని రాజ్‌విహార్‌ కూడలి నుంచి వినాయకుడి విగ్రహంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి, పార్టీ నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరారు. 


కలెక్టరేట్ ముట్టడి


రాజ్‌విహార్‌ కూడలిలోనే విష్ణువర్ధన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కర్నూలులోని రెండో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు వెళ్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. మార్గమధ్యలో శ్రీకృష్ణదేవరాయల కూడలి వద్ద సోమువీర్రాజును పోలీసులు అరెస్టు చేశారు. తాలూకా స్టేషన్‌కు తరలించారు. రాజ్‌విహార్‌ కూడలి నుంచి కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్న బీజేపీ శ్రేణులు నేతల అరెస్టులపై ధర్నా నిర్వహించారు.


సోము వీర్రాజు అరెస్టు


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అరెస్టు చేస్తున్న క్రమంలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బైరెడ్డి శబరికి స్వల్పగాయాలయ్యాయి. సుమారు వంద మందిని అరెస్టు చేసి వాహనాల్లో తరలిస్తుండగా కార్యకర్తలు పోలీసుల వాహనాలకు అడ్డుగా వెళ్లడంతో తోపులాట చోటుచేసుకుంది. బైరెడ్డి శబరి చేతికి స్వల్ప గాయాలవ్వడంతో ఆయనను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాజ్‌విహార్‌ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు చేపట్టిన 4 గంటల ర్యాలీ ఆందోళనలతో ఉద్రిక్తతంగా మారింది. తమ నేతను విడుదల చేయాలని, వినాయక చవితి మండపాలకు అనుమతి ఇవ్వాలని కొందరు బీజేపీ కార్యకర్తలు కలెక్టరేట్‌ సమీపంలోని సెల్‌టవర్‌ ఎక్కారు. 


ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలు


బీజేపీ ముఖ్య నేతల అరెస్టులు, వినాయక చవితి వేడుకలకు అనుమతులు నిరాకరణ వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా తమ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించి, అధికారులకు వినతి పత్రాలు అందించాలని రాష్ట్ర నాయకత్వం కార్యకర్తలకు సూచించింది.  


Also Read: Petrol-Diesel Price, 6 September 2021: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా