BJP News In Andhra Pradesh : ఏపీ(Andhra Pradesh)లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. టీడీపీ(TDP), జనసేన(Janasena) పొత్తులో బీజేపీ(BJP) కూడా కలిసొచ్చే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు సీట్ల సర్దుబాటుపై కూడా మూడు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. 17 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లను బీజేపీ ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. త్వరలోనే బీజేపీ వైఖరిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ(YCP)కి అనుకూలంగా బీజేపీ వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. సోము వీర్రాజు(Somu Veerraju) ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంపై అంతగా విమర్శలు చేయలేదు.


2014 సీన్ రిపీట్ అవుతుందా..?


పురందేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించిన తర్వాత ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తున్నారు. జగన్(Jagan) ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు. దీనిని బట్టి చూస్తే జగన్ ప్రభుత్వంపై బీజేపీ దూకుడు ప్రదర్శిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఎన్డీయే(NDA) కూటమిలో ఉన్న పవన్(Pawan Kalyan) కూడా టీడీపీతో పొత్తు ప్రకటించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ సమయంలో టీడీపీ-జనసేన పొత్తు వల్ల ఆ రెండు పార్టీల కూటమి బలంగా మారింది. దీంతో టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా కలిస్తే 2014 ఎన్నికల సీన్ రిపీట్ కానుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేయగా.. పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపి ప్రచారం కూడా నిర్వహించారు. ఇప్పుడు కూడా మూడు పార్టీల పొత్తు ఉంటుదని టాక్ నడుస్తోంది.


జనసేన మిత్రపక్షమే


ఈ క్రమంలో బీజేపీ కీలక రాజకీయ తీర్మానం చేసింది. జనసేన తమ మిత్రపక్షమేనని బీజేపీ తీర్మానం చేసింది. విజయవాడలో బుధవారం బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో జనసేన మిత్రపక్షమేనని తీర్మానం చేశారు. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడించారు. ఏపీలో జనసేన తమకు మిత్రపక్షమేనని నేతలందరూ తీర్మానం చేశారని ఆమె తెలిపారు. టీడీపీతో పొత్తుపై కూడా పురంధేశ్వరి స్పందించారు. టీడీపీతో పొత్తుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని అన్నారు. టీడీపీతో పొత్తు నిర్ణయంపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని, కానీ కేంద్ర పథకాలను తమ పథకాలుగా జగన్ చూపించుకుంటున్నారని ఆరోపించారు. ఏ పథకంలో చూసినా తమ జేబులోకి ఎంత వస్తుందనేదే వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారని విమర్శించారు.


సంక్రాంతి తర్వాత మారనున్న పరిణామాలు


వైసీపీ ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రెండు విడతల అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. సంక్రాంతి తర్వాత అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఇక టీడీపీ-జనసేన కూడా అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టగా.. బీజేపీ కలిసి రావడంపై సంక్రాంతి తర్వాత ఫుల్ క్లారిటీ రానుంది. బీజేపీని కలుపుకునేందుకు టీడీపీ కూడా రెడీగా ఉంది. బీజేపీని కలుపుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ అండ ఉంటుందని భావిస్తోంది. బీజేపీ కూడా పొత్తులో కలిసొచ్చేలా పవన్ కూడా కాషాయ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.