Andhra BJP :  జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో త్వరలో భేటీ అవుతానని ఏపీబీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. వస్తున్న ఆదాయంలో నలభై శాతం వడ్డీలకే కడుతున్నారని.. లెక్కల్లో చూపకుండా అప్పులు తెచ్చి  వృధా చేస్తున్నారని మండిపడ్డారు. పొత్తుల అంశంపై కేంద్ర పార్టీదే తుది నిర్ణయం అని స్పష్టం చేశారు.  


అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి :   పురందేశ్వరి 
 
ఏపీలోని ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.  ఆర్థికపరమైన వ్యవహరాల్లో కేంద్రం ఏపీని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందని స్పష్టం చేశారు.    ఏపీపై విభజన నాటికి రూ.97వేల‌ కోట్ల భారం ఉందని చెప్పారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో‌ రూ.2,65,365 కోట్లు అప్పు చేశారని.. నలభై వేల కోట్లు కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జులై వరకు నాలుగేళ్లల్లో రూ.7,14,631 కోట్లు అప్పు చేశారన్నారు. రూ.2లక్షల 39వేల 716 కోట్లు అధికారికంగా, రూ.4లక్షల 74వేల 315 కోట్లు అనధికారికంగా అప్పు తెచ్చారన్నారు. ఈ అనధికార అప్పే నేడు ఏపీ అభివృద్ధికి నిరోధకంగా మారిందని వెల్లడించారు. లిక్కర్ బాండ్స్ ద్వారా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి తెచ్చారన్నారు. ఉద్యోగులను తాకట్టు పెట్టి, ప్రభుత్వ సంస్థలను పెట్టి అప్పులు చేశారని విమర్శించారు. గ్రామ పంచాయతీ నిధులు మళ్లించారన్నారు.   సింకింగ్ ఫండ్‌ను కూడా వదిలి పెట్టలేదన్నారు. ఉద్యోగుల పి.ఏఫ్ నుంచి, ఇ.యస్.ఐ నుంచి, జనరల్ పీఎఫ్ నుంచి ఇలా అనేక మార్గాల్లో అనధికారికంగా రూ. 4,74,315 కోట్లు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. తీసుకున్న అప్పులకు యాభై వేల‌కోట్ల రూపాయలు వడ్డీ కింద కడుతున్నారని తెలిపారు.  


రాబోయే ఆదాయం చూపి అప్పులు తెచ్చిన తొలి రాష్ట్రం 


మద్యంపై రాబోయే ఆదాయం చూపి అప్పు తేవడం దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. ప్రభుత్వం ఆస్తులను తనఖా పెట్టి డబ్బులు తేవడం చూస్తే జగన్మోహన్ రెడ్డి తీరు అర్ధం అవుతుందని తెలిపారు. అప్పులు తెచ్చి పనులు చేసిన కాంట్రాక్టర్‌లు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. గ్రామ సర్పంచ్‌ను ప్రజలు ఎన్నుకుంటే వారికి విలువ లేకుండా చేశారన్నారు. సర్పంచ్‌ల ఖాతాల్లో వేసిన డబ్బులను మళ్లించిన ఘతన జగన్మోహన్ రెడ్డి దే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా నేడు సర్పంచ్‌లు ఒకే వేదికపైకి వచ్చి పోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బెన్‌ఫిట్‌లు ఇవ్వకుండా నిధులు మళ్లించారని విరుచుకుపడ్డారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు భరోసా లేకుండా చేశారన్నారు. అసలు జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని‌ పరిస్థితి దాపురించిందన్నారు


త్వరలో పవన్ తో చర్చలు : పురందేశ్వరి 


పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు. సరైన సమయంలో సరైన నిర్ణయం బీజేపీ పెద్దలు తీసుకుంటారని చెప్పారు. ‘‘జనసేన మా మిత్రపక్షం... పోన్‌లో పవన్ కళ్యాణ్‌తో మాట్లాడాను... త్వరలో అవకాశం బట్టి కూర్చుని మాట్లాడుకుంటాం’’ అని ఏపీ బీజేపీ చీఫ్ వెల్లడించారు. ఇప్పటి వరకూ పొత్తులో ఉన్నా ఈ రెండు పార్టీలు కలిసి పని చేయడం లేదు.  వన్ కల్యాణ్ ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడం... బీజేపీతో పొత్తు ఖాయమని.. టీడీపీ కలిసి వస్తుందో లేదో ఆ పార్టీ ఇష్టమని ప్రకటన చేసిన నేపధ్యంలో..  మరింత చొరవ తీసుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. త్వరలో  పవన్ తో భేటీ కావాలని పురందేశ్వరి నిర్ణయించారు.