Mamannan OTT Release Date : తమిళ బ్లాక్ బస్టర్ 'మామన్నన్' (తెలుగులో ‘నాయకుడు’) ఇప్పుడు డిజిటల్ స్ర్కీన్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మూవీ జూలై 27 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని డిజిటల్ పార్ట్ నర్ నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. వడివేలు, ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్‌కి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.
'మామన్నన్' తమిళం, తెలుగు, మలయాళంతో పాటు కన్నడ భాషల్లో ఓటీటీలో విడుదలయ్యేందుకు రెడీ ఉందని ఈ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ ధృవీకరించింది. తెలుగు వెర్షన్ 'నాయకుడు' ఇటీవలే థియేటర్లలో విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్ తన సొంత బ్యానర్ రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించింది. కాగా ఈ మూవీకి ఆస్కార్ విన్నింగ్ సంగీతకారుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాయి. దాదాపు రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుంది.
పొలిటికల్ థ్రిల్లర్ 'మామన్నన్'.. జూన్ 29, 2023న థియేటర్లలో విడుదలైంది. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ కోలీవుడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.63 కోట్లు రాబట్టింది. ఇదిలా ఉండగా సోనీ మ్యూజిక్ సౌత్ జూన్ 16, 2023న మామన్నన్ అధికారిక ట్రైలర్‌ను యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఈ ట్రైలర్‌లో వినిపించిన పద్యాన్ని తెలుగు కవి నంగముని రాశారు. కలైంజర్ టీవీ ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.
తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ కమెడియన్ నటుల్లో వడివేలు ఒకరు. ఇప్పటికే చాలా సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఈ 'మామన్నన్' లో మాత్రం ఓ సీరియస్ పాత్రలో నటించి, మెప్పించారు. తన నటనతో అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశారు. ఇక మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి తెలుగులో అంతగా ప్రచారం చేయకపోవడంతో అంతగా ఆడలేదు. కానీ సినిమా చూసిన వారు మాత్రం మంచి మార్కులే వేస్తున్నారు. ముఖ్యంగా వడివేలు నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. దళిత ఎంఎల్ఏగా ఆయన నటించిన తీరుపై అంతటా ప్రశంసలు వినిపిస్తున్నాయి.
కథేంటంటే..
అణగారిన వర్గానికి చెందిన మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యేగా అందరికీ మంచి చేస్తూ ఉంటాడు. అతని కొడుకు వీరన్ (ఉదయనిధి స్టాలిన్) అభ్యుదయ భావాలు గల వ్యక్తి. కులవ్యవస్థ వల్ల అతను చిన్నతనంలో అనేక అవమానాల పాలవుతాడు. ఆ తర్వాత లీలా(కీర్తి సురేశ్)తో ప్రేమలో పడతాడు. సేవా కార్యక్రమాలు చేసే లీలాను రత్నవేలు(ఫహాద్ ఫాజిల్) అనేక ఇబ్బందులు పెడతాడు. ఆమెకు సాయం చేసేందుకు వీరన్, మామన్నన్ రంగంలోకి దిగి సమస్యకు పరిష్కారం కనుగొంటారు. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కునే సమస్యలేంటీ, వాళ్లు రత్నవేలుకు ఎలా బుద్ధి చెప్తారు.. అనేది ఈ సినిమాలో సారాంశంగా చెప్పవచ్చు.
Read Also : Ranbir Alia Marriage: వారిదో నకిలీ వివాహం, తనని కలవాలంటూ వేడుకుంటున్నాడు - రణబీర్ జంటపై కంగనా వ్యాఖ్యలు?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial