Atchennaidu Comments on Liquor: అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన సీఎం జగన్, ఊరూ వాడా నాసిరకం మద్యం తెచ్చి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu) ఆరోపించారు. మంగళగిరిలో (Mangalagiri) ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలు బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్మినట్లుగా మద్యం అమ్ముతున్నారని, ఫుడ్ డెలివరీ చేసినట్లుగా లిక్కర్ డోర్ డెలివరీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తయారీ నుంచి అమ్మకం వరకూ మొత్తం సీఎం జగన్ ఆధ్వర్యంలోనే జరుగుతుందని మండిపడ్డారు. చంద్రబాబు (Chandrababu) పాలనలో మద్యం రూ.50 వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని, వైసీపీ హయాంలో ప్రభుత్వ అధికారిక ఆదాయం రూ.1.14 లక్షల కోట్లయితే, అనధికారికంగా సీఎం జగన్ కు రూ.లక్ష కోట్ల సొంత ఆదాయం వచ్చిందని ఆక్షేపించారు. ధరలు పెంచితే మద్యం తాగేవారు తగ్గుతారనేది ఓ పిచ్చి వాదన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో నిరంతరం మద్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయని ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో కనీస హామీలు కూడా నెరవేర్చకుండా 99 శాతం హామీలు అమలు చేశామని జగన్ చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.


'జగన్ ఓ అబద్ధాల పుట్ట'


సీఎం జగన్ నోరు ఓ పెద్ద అబద్ధాల పుట్టని, ప్రజల్ని మాయమాటలతో మోసగించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు పాలనపై విష ప్రచారం చేసి, లెక్కకు మించి హామీలిచ్చిన జగన్, అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారని మండిపడ్డారు. అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే టీడీపీ, చంద్రబాబుపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా మద్యంపై వచ్చే ఆదాయాన్ని 15 ఏళ్లు తాకట్టు పెట్టి రూ.30 వేల కోట్లు అప్పుతెచ్చిన అసమర్థుడు జగన్ రెడ్డి అని ఆక్షేపించారు. 


దోపిడీ కోసమే ధరల పెంపు


సీఎం జగన్ దోపిడీ కోసమే మద్యం ధరలు పెంచారు తప్ప, పేదలను మద్యం మాన్పించడానికి కాదని అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ హయాంలో రూ.60 అమ్మిన క్వార్టర్ మద్యాన్ని వైసీపీ హయాంలో రూ.200 నుంచి రూ.250 వరకూ విక్రయిస్తున్నారని, ఇది కూడా దారుణమైన కల్తీ మద్యం అని ఆరోపించారు. ధరలు పెంచితే ఎంత శాతం మద్యం విక్రయాలు తగ్గాయో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. 2020-21తో పోలిస్తే ఈ ఏడాది మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని, ఈ లెక్కలన్నీ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నట్లు చెప్పారు. సీఎం జగన్ కు డబ్బే ముఖ్యమని, రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలతో పని లేదని దుయ్యబట్టారు. ప్రజలు వాస్తవాలు గ్రహించి అప్రమత్తం కావాలని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జగన్ రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ - జనసేన ఉమ్మడి కార్యక్రమాలు ముగిశాక, భవిష్యత్ కార్యక్రమాల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.


Also Read: Andhra News : ఏపీలో ఇసుక దోపిడీ - నేరుగా తాడేపల్లికే సొమ్ము - వైసీపీని మరోసారి టార్గెట్ చేసిన పురందేశ్వరి !