Andhra News purandeswari : ఆంధ్రప్రదేశ్‌లో అడ్డగోలుగా ఇసుక దందా సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ( Purandeswari ) ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బురిలంక రేవు ( Burrilanka ) వద్ద ఇసుక తవ్వకాలను బీజేపీ, జనసేన నేతలతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి నర్సరీ రైతులు ఇసుక అక్రమాలను ఇరు పార్టీల నేతలకు వివరించారు. దశాబ్దాలుగా ఇలాంటి ఇసుక దందా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైనా చెప్తే చంపేస్తాం, కాల్చిపారేస్తాం అనేలా బెదిరిస్తున్నారని వాపోయారు. బుర్ర లంకలో ఇసుక ర్యాంపుల్లో ( Sand Ramp ) అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని ప్రశ్నిస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని పురందేశ్వరి మండిపడ్డారు.
అక్రమ తవ్వకాల కోసం న కిలోమీటర్ల మేర వాహనాల క్యూ
నాలుగు ఐదు కిలో మీటర్ల మేర లారీలు క్యూ లైన్‌లో ప్రమాదకరంగా ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ ఆగడాలకు కడియం నర్సరీ రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పర్యావరణ నిబంధనల ప్రకారం మిషనరీతో తవ్వకాలు జరుగుతున్నాయని.. దీనివల్ల ధవళేశ్వరం బ్యారేజ్ తో పాటు పర్యావరణానికి ముప్పు ఉందన్నారు. కంపెనీ పేరు లేకుండా బిల్స్ ఉన్నాయని, ఢిల్లీలో ఉన్న వారి పేరుతో ఇక్కడ తవ్వకాలు ఇల్లీగల్ గా జరుగుతున్నాయని ఆరోపించారు.
జేసీ సంస్థ పేరుతో అడ్డగోలు దోపిడీ - నేరుగా తాడేపల్లికి నిధులు
ఆంధ్రాలో ఇసుక సరఫరా దోచుకో దాచుకో అన్న చందాన జరుగుతోందని మండిపడ్డారు. జేపీ సంస్థ ముసుగులో అడ్డగోలుగా ఇసుక దందా సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోపిడీలో వచ్చే సొమ్మంతా తాడేపల్లికే వెళ్తోందన్నారు. నదీ గర్భంలో యంత్రాలతో తవ్వకాలు చేయొద్దన్న హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు మే నెలతో పూర్తి అయ్యాయి. నేటికీ ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతుండడం వైసీపీ ప్రభుత్వ దోపిడీకి అద్దం పడుతోందన్నారు.
అవినీతిని ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలు
ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిపై మేము మాట్లాడితే మాపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారన్నారు. రుజువులతో మేము మాట్లాడితే ప్రభుత్వం సమాధానం చెప్పటం లేదన్నారు. జేపీ కంపెనీకి అనుమతి పూర్తయిందని పురందేశ్వరి అన్నారు. రూ.48 కోట్లకు ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరిపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. పర్మిట్లపై ఎవరి సంతకం లేదన్నారు. ఒకొక్క లారీకి 30 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇసుక అక్రమ తవ్వకాలపై సమాధానం చెప్పాలని పురందేశ్వరి తెలిపారు.