Ganta Srinivasreddy Letter to CM Jagan: 'నిన్నటివరకూ 'గడపగడపకూ వైసీపీ' అన్నారు. ఇప్పుడు 'వై ఏపీ నీడ్స్ జగన్' (Why AP Needs Jagan)అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. వైసీపీ నేతలు ప్రతి గడపలోనూ అవమానంతో వెనుదిరుగుతున్నారు. నేడు ఏపీ హేట్స్ జగన్, నిన్ను నమ్మం జగన్' అంటూ ప్రజలే ఎదురు తిరుగుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) మండిపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్ (CM Jagan) కు ఆయన ట్విట్టర్ వేదికగా 20 ప్రశ్నలు సంధించారు. వీటికి జగన్ రెడ్డి, మంత్రులు, సలహాదారులు, ఎవరో ఒకరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ మూర్ఖత్వపు పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, ఈ రాష్ట్రానికి జగన్ ఎందుకు వద్దో చెప్పడానికి నా వద్ద సవాలక్ష కారణాలున్నాయంటూ విమర్శించారు. నవరత్నాలను నవ మోసాలుగా పేర్కొన్న గంటా, ఏ ఒక్క రత్నాన్ని సరిగ్గా అమలు చేయలేదని దుయ్యబట్టారు. 


'వై ఏపీ నీడ్స్ జగన్' ఎందుకు.?'


'రైతు భరోసాను రూ.37,500కు కుదించారు. రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, డ్రిప్ ఇరిగేషన్ పథకాలు రద్దు చేసి రూ.2 లక్షలు నష్టం చేశారు. అమ్మఒడికి రూ.13 వేలు ఇచ్చి నాన్న బుడ్డీలో రూ.70 వేలు కొట్టేస్తున్నారు. MTF, RTF స్కాలర్ షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలను రద్దు చేశారు. రూ.3 వేల పెన్షన్ హామీపై మాట తప్పారు. ఏటా పెంపు హామీపై మడమ తిప్పారు. సెంటు పట్టా పేరుతో పేదల్ని అప్పుల పాల్జేశారు. భూమి కొనుగోలులో రూ.7 వేల కోట్లు వైసీపీ నేతలు మింగేశారు. ఓటీఎస్ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల - రూ.40 వేల చొప్పున బలవంతంగా వసూలు చేశారు.' ఇవన్నీ చేసినందుకేనా 'వై ఏపీ నీడ్స్ జగన్' అంటున్నారు అంటూ గంటా విమర్శించారు.


మద్య నిషేధం ఏమైంది.?


చంద్రబాబు హయాంలో 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తే, జగన్ రెడ్డి 9 లక్షల మందికే ఇస్తున్నారు. చంద్రన్న ఒకే విడతలో ఇస్తే.. జగన్ రెడ్డి నాలుగు విడతలతో మోసం చేస్తున్నారని గంటా దుయ్యబట్టారు. 'రూ.2 లక్షల కోట్లకు పైగా మద్యం అమ్మి పేదలను కొల్లగొట్టారు. రూ.లక్ష కోట్లు కమీషన్లుగా దండుకున్నారు. మద్య నిషేధంపై మాట తప్పి మహిళల మాంగళ్యాలను తెంచుతున్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని దెబ్బ తీసి నదుల అనుసంధానానికి గండికొట్టారు. రాష్ట్రాన్ని కరవు రక్కసికి బలిపెట్టారు. ఈ ఏడాది 34 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిపోయింది.' ఇందుకేనా 'వై ఏపీ నీడ్స్ జగన్' అంటున్నారు అంటూ గంటా నిలదీశారు.


'దేశంలోనే ధనిక సీఎం'


ల్యాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం దోపిడీ చేసి రూ.3.5 లక్షల కోట్లు కొల్లగొట్టారు. పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమే అంటున్న మీరు.. దేశంలోని ముఖ్యమంత్రులు అందరికంటే ధనవంతుడైనందుకా 'వై ఏపీ నీడ్స్ జగన్...?' అంటూ ఎద్దేవా చేశారు. ప్రశ్నించిన పౌరులు, మీడియా, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, జైలు నిర్బంధాలు, హత్యలు, రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ టెర్రిస్టు పాలన చేస్తూ, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినందుకా 'వై ఏపీ నీడ్స్ జగన్...?' అంటూ ప్రశ్నించారు.


అలాగే, రైతు రుణమాఫీ, అధిక ధరలు, పన్ను ఛార్జీలపైనా గంటా శ్రీనివాసరావు ప్రశ్నలు సంధించారు. ఉచిత ఇసుక విధానం రద్దు చేసి, ధరలు 4 రెట్లు పెంచి 30 లక్షల భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని పోగొట్టారని మండిపడ్డారు. కేసుల భయంతో కేంద్రం వద్ద మోకరిల్లారని, అన్న క్యాంటీన్లు, పసుపు - కుంకుమ, నిరుద్యోగ భృతి, చంద్రన్న భీమా, పండుగ కానుకలు లాంటి 120 పైగా సంక్షేమ పథకాలు రద్దు చేసి పేదోడి పొట్ట కొట్టారని సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


'యువతను మోసం చేశారు'


2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానని మాట తప్పి యువతకు ఉద్యోగ కల్పన చేయకుండా, ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండరని నమ్మించి.. ఆశతో ఎదురు చూపులు చూసి యువత విసిగి ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లేలా చేసినందుకా 'వై ఏపీ నీడ్స్ జగన్...?' అంటూ గంటా ధ్వజమెత్తారు. రివర్స్ పాలనతో పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోయేలా చేసినందుకేనా మీ పాలన మళ్లీ ప్రజలు కోరుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. తాను 16 నెలలు జైలులో ఉన్నాడు కాబట్టి... లేని కేసులో చంద్రబాబును జైల్లో పెట్టి  పైశాచికానందం పొందినందుకా 'వై ఏపీ నీడ్స్ జగన్...?' అంటూ మండిపడ్డారు. 'ఈ రాష్ట్రానికి మీరు వద్దని చెప్పడానికి ఇంకా సవాలక్ష కారణాలు ఉన్నాయని, మీరు ఈ రాష్ట్రానికి అవసరం లేదనడానికి ఇంతకంటే ఏం రుజువులు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు' అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. 






Also Read: TDP Janasena : ఇక టీడీపీ, జనసేన ఉమ్మడి పోరాట కార్యాచరణ - సమన్వయ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే !