ఏపీలో కరోనా కేసులు(Corona Cases) భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 18,803 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 244 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,716కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 662 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2,293,535 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 5,565 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,16,711 కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,30,10,692 నిర్థారణ పరీక్షలు చేశారు. 






2022లోనే కరోనా అంతం!


కరోనా అంతమయ్యేది ఎప్పుడు? ఇప్పుడు ఎంతో మందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇదే. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన రష్యా ప్రతినిధి మెలిటా ఉజ్నోవిక్ సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. తన అంచనా ప్రకారం 2022లోనే కరోనా అంతమవుతుందని, అంతం అనగానే అది పూర్తిగా ప్రపంచం నుంచి తుడిచిపెట్టుకుపోతుందని కాదని తెలిపారు.దాని తీవ్రతను పూర్తిగా తగ్గించుకుని సాధారణ ఆరోగ్యసమస్యలా మారుతుందని వివరించారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ తరువాత పెద్దగా ఏ వేరియంట్ కూడా వ్యాప్తి చెందలేదు, ఆ తరువాత వచ్చిన సబ్ వేరియంట్ల ప్రభావం ప్రజలపై అధికంగా లేదు కాబట్టి ఇక కరోనా వైరస్ బలహీనంగా మారినట్టేనని భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఏడాదే కరోనా ముగింపు దశకు చేరుకుంటుందని చెప్పారు. అదే జరిగితే మానవాళి ఓ మహమ్మారి బారి నుంచి బయటపడినట్టేనని అన్నారు.


‘కేసులు అధికంగా ఉన్నాయి అంటే వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందే, పరివర్తన చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని అర్థం. ఒమిక్రాన్ ప్రపంచమంతా ఓసారి వ్యాపించాక దాని జోరు తగ్గింది. ఈ తరువాత మరే వేరియంట్ ఈ స్థాయిలో వ్యాప్తి చెందలేదు. అందుకే ఇది చివరిదని ఆశిస్తున్నాం’ అని ఆమె అభిప్రాయపడ్డారు. చాలా దేశాల్లో ఒమిక్రాన్ ఉప్పెన తగ్గుముఖం పట్టడంతో అన్ని ఆంక్షలను ఎత్తివేశారు. కొన్ని దేశాల్లో స్వల్ప స్థాయిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.ఇటీవల WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ మాట్లాడుతూ కరోనా వైరస్ పై విజయం సాధించామని ఏ దేశమైనా ప్రకటించుకుంటే అది ముందుగా తొందరపడడమే అవుతుందని, మరికొంతకాలం వేచి చూడాలని అన్నారు.