ఏపీ నేతల రచ్చ దిల్లీకి చేరింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ నేతల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి నేడు (అక్టోబరు 25) ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మొత్తం 18 మంది టీడీపీ నేతలు దిల్లీకి వెళ్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారు అయ్యింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని బృందం రెండు రోజులు దిల్లీలో పర్యటించనుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కోవిడ్ దృష్ట్యా చంద్రబాబు సహా ఐదుగురికి మాత్రమే అనుమతి లభించింది. ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్‌మెంట్‌లు ఇంకా ఖరారు కాలేదు.
ఏపీలో పరిస్థితలు కేంద్రం దృష్టికి
రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీలు, కొందరు పొలిట్‌బ్యూరో సభ్యులు.. సోమవారం ఉదయం 6 గంటలకు చంద్రబాబుతో కలిసి హైదరాబాద్ నుంచి దిల్లీ బయలుదేరనున్నారు. ఏపీలో ఇటీవల ప్రత్యక్షదాడులు, మాటల యుద్ధాలు జరిగాయి. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ సానుభూతిపరులు దాడులకు పాల్పడ్డారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టాభిరామ్ సీఎం జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు కాకరేపాయి. ధర్నాలు, దీక్షలు, నిరసనలతో ఏపీలో ఒక్కసారిగా హీట్ పెరిగింది.
Also Read: వైఎస్ఆర్సీపీ ఉగ్రదాడి చేసింది... పోలీసులు దగ్గరుండి మరీ దాడి చేయించారు... వైసీపీపై చంద్రబాబు ఫైర్
కేంద్ర పెద్దలను కలిసే అవకాశం
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, రాష్ట్రపతి పాలన పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఈ అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు. చంద్రబాబు దిల్లీ పర్యటనలో కొందరు కేంద్ర పెద్దలను కూడా కలవాలని భావిస్తున్నారు. అచ్చెన్నాయుడు, యనమల, కేశినేని నాని, పయ్యావుల కేశవ్, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, షరీఫ్, కాల్వ శ్రీనివాసులు, అనిత, రామానాయుడుతోపాటు మరికొందరు నేతలు కూడా దిల్లీ వెళ్లనున్నారు.
Also Read: టీడీపీ వర్సెస్ వల్లభనేని వంశీ... నేతల మధ్య ట్వీట్ వార్