ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. పంట, ఆస్తి నష్టంతో పాటు భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ వరదల్లో 44 మంది మృతి చెందారని, మరో 16 మంది గల్లంతు అయ్యారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ వైఫల్యం కారణంగానే నష్ట తీవ్రత అధికంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీఎస్ సమీర్ శర్మకు ఆదివారం లేఖ రాశారు.
Also Read: ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. జాబ్ కొడితే రూ.60 వేల జీతం.. ఇంకా రెండు రోజులే ఉంది
ప్రకృతి వైపరీత్యాల నిధులు దారిమళ్లింపు
వరదల వల్ల ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లిందని తేలితే కేవలం రూ.35 కోట్లు విడుదల చేయడం సరికాదని లేఖలో చంద్రబాబు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు వినియోగించాల్సిన నిధులను దారి మళ్లించడాన్ని కాగ్ తప్పుబట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోయిందని చంద్రబాబు విమర్శించారు. తుమ్మలగుంట చెరువును ఆటస్థలంగా మార్చడంతో తిరుపతిని వరదలు ముంచెత్తాయన్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ విచారణ జరిపించాలని సీఎస్ ను కోరారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిందన్న చంద్రబాబు... రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయన్నారు. బాధితులు తిండి, వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Also Read: వేదికపై పాదాభివందనం చేసిన రేవంత్ రెడ్డి.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
న్యాయ విచారణ జరిపించాలి
వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల ప్రజలు, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వరదల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ముంపు ప్రాంతాల్లో నిరాశ్రయులకు సాయం అందడంలేదని ఆవేదన చెందారు. వరదల నివారణలో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జాతీయ ప్రకృతి వైపరీత్యాల సంస్థ మార్గదర్శకాల అనుగుణంగా ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందించాలని చంద్రబాబు కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు.
Also Read: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి