PSLV C55 Success : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. శ్రీహరికోట షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 55 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్ఎల్వీ సీ55 ను షార్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు కౌంట్‌డౌన్‌  ప్రారంభమై... నిరంతరాయంగా 25.30 గంటల పాటు కొనసాగింది. సింగపూర్ కు చెందిన రెండు ఉపగ్రహాలను ఈ వాహక నౌక నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగంలో సింగపూర్ కు చెందిన టెలీయోస్-2, లూమోలైట్-4 శాటిలైట్స్ ను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించారు. సింగపూర్‌ ప్రభుత్వానికి చెందిన ఉపగ్రహం టెలీయోస్‌-2 లో సింథటిక్‌ ఎపర్చర్ రాడార్‌ పేలోడ్‌ ఉంది. ఈ ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితుల్లో కవరేజీ అందించగలదు. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్ఫోకామ్‌ రీసెర్చ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లోని శాటిలైట్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో రూపొందించిన లూమాలైట్‌-4 ఉపగ్రహం... సింగపూర్‌ ఈ-నావిగేషన్‌ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్‌ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంతో ప్రయోగించారు.  










కక్ష్యలోకి సింగపూర్ ఉపగ్రహాలు 


741 కిలోల బరువున్న భూ పరిశీలన ఉపగ్రహం టెలీయోస్-2 సింగపూర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వివిధ ఏజెన్సీల ఉపగ్రహ చిత్రాల అవసరాలను తీర్చడానికి, అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఇది పనిచేస్తుంది. మరో ఉపగ్రహం LUMELITE-4 .. 16 కిలోల బరువున్న అధునాతన ఉపగ్రహం, అధిక ఫ్రీక్వెన్సీ డేటా మార్పిడి వ్యవస్థను ఇందులో ఉంది.  సింగపూర్ ఇ-నావిగేషన్ సముద్ర భద్రతను పెంచడానికి,  ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడానికి ఈ ఉపగ్రహాన్ని తయారుచేశారు. TeLEOS-2ని డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (DSTA), రక్షణ, సైన్స్ సంబంధిత కార్యకలాపాలను నిర్వహిస్తుంది.  సింగపూర్ టెక్నాలజీస్ ఇంజినీరింగ్, సింగపూర్ ఏరోస్పేస్ మధ్య భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధి చేశారు. ఈ రెండు ఉపగ్రహాలను తూర్పు దిశగా ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.  పీఎస్‌ఎల్‌వీకి ఇది 57వ ప్రయోగం. ఈ వాహక నౌక పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (POEM)ని కూడా మోసుకెళ్లింది. POEM-2 ద్వారా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST), బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ధ్రువ స్పేస్‌ సంస్థలు అభివృద్ధి చేసిన ఏడు పేలోడ్‌లు ప్రయోగించారు.  నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రయోగించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.