Home Minister Vangalapudi Anitha Comments On Red Book: 'తమకు కక్ష సాధింపు, ప్రతీకారం ఉంటే ఇంతవరకూ ఆగుతామా.?' అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు. గురువారం డీజీపీ, ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తొలిసారిగా 'రెడ్ బుక్'పై స్పందించిన ఆమె.. అది కక్ష సాధింపు చర్యలకు కాదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన అధికారులపై చట్టపరంగా చర్యలుంటాయని స్పష్టం చేశారు. తాము ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎంతోమందిని అరెస్ట్ చెయ్యొచ్చని.. కానీ ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని చెప్పారు. తమ నాయకుడు, సీఎం చంద్రబాబు చెప్పిన ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామని తెలిపారు. 


'ఆ 4 అంశాలే ఎజెండా'


రాష్ట్రంలో 4 అంశాలను ఎజెండాగా పెట్టుకుని ముందుకెళ్తున్నామని హోం మంత్రి అనిత వెల్లడించారు. మహిళలకు రక్షణ, గంజాయి నిర్మూలన, పోలీసుల సంక్షేమం, పోలీస్ శాఖలో నియమకాల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 'గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా వైఫల్యం చేయించారు. ఆ శాఖకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించటంలో వైఫల్యం చెందారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ 12 రోజుల్లో చాలా అంశాలను పరిశీలించాను. పోలీస్ అకాడమీ లేదు, గ్రేహౌండ్స్ అకాడమీ లేదు. కేంద్రం నుంచి నిధులొచ్చినా పోలీస్ అకాడమీ నిర్మించలేదు. గత ఐదేళ్లలో హోంగార్డులు, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. వైసీపీ హయాంలో పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారు. నేటికీ విశాఖ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ రేకుల షెడ్డులోనే నడుస్తోంది. ఎస్కార్ట్ వాహనాలు కూడా పనిచేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. 2014లో ఇచ్చిన వాహనాలనే ఇప్పటికీ వాడుతున్నారు. పోలీస్ స్టేషన్లలో మెయింటెనెన్స్ ఖర్చు రూ.8 వేలు కూడా ఇవ్వలేదు.' అని పేర్కొన్నారు.


సచివాలయాల్లో మహిళా పోలీసులపై


ఎలాంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులను పెట్టారని.. ఏ విధంగా వారు పోలీసు విధులు నిర్వహిస్తారని హోంమంత్రి అన్నారు. వారి సేవలు ఏ విధంగా వినియోగించాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గంజాయి రవాణా బాగా పెరిగిందని.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌లో రాష్ట్రాన్ని మూడో స్థానంలోకి తెచ్చారని అన్నారు. గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని.. ఇప్పటికే ఉప సంఘం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజల భాగస్వామ్యంతోనే గంజాయిని అరికట్టే వీలుంటుందని అన్నారు. మంచి ఆలోచనలతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని స్పష్టం చేశారు.


'రాజకీయాలు చెయ్యొద్దు'


పోలీసులు రాజకీయాలు చెయ్యొద్దని.. వారి విధులు వారు బాధ్యతగా నిర్వర్తించాలని మంత్రి అనిత సూచించారు. 'ప్రజలు ధైర్యంగా స్టేషన్‌‍కు వెళ్లి బాధలు చెప్పుకొనేలా భరోసా ఇవ్వాలి. పోలీస్ సిబ్బంది ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలి. ఇకపై ఫ్రెండ్లీ పోలీసింగ్ రావాలి. సోషల్ మీడియాలో నేనూ ఓ బాధితురాలినే. కొంతమంది ఐపీఎస్ అధికారుల తీరుతో పోలీస్ వ్యవస్థకే  చెడ్డపేరు వస్తోంది. గత ప్రభుత్వంలో నాపైనే అక్రమంగా కేసులు నమోదు చేశారు. అసభ్య పోస్టులపై విచారించి చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో దిశ చట్టమే లేదు. ఇక ఆ స్టేషన్ల పేరు కూడా మార్చే ఆలోచన చేస్తాం.' అని తెలిపారు.


Also Read: CS Neerabh Kumar: ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం పొడిగింపు - కేంద్రం కీలక ఉత్తర్వులు