Central Government Extends CS Neerabh Kumar Tenure: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు 6 నెలల పాటు పదవీ కాలం పొడిగిస్తూ డీవోపీటీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీ కాలం జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర సీఎస్‌గా నీరభ్ కుమార్ జూన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండడంతో ఇటీవల ప్రభుత్వం ఆయన సర్వీసు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాసింది. ప్రభుత్వ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం ఆయన పదవీ కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సమాచారం ఇచ్చింది.


నీరభ్ కుమార్ ప్రసాద్ సీఎస్ కావడానికి ముందు రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1988లో ప.గో జిల్లాలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1990లో తూ.గో సబ్ కలెక్టర్, 1991లో ఏటూరునాగారం ఐటీడీఏ పీవో, 1992లో కృష్ణా జిల్లా పీడీ ఆర్డీఏగా పనిచేశారు. 1993లో కృష్ణా జిల్లా జేసీగా, 96లో ఖమ్మం కలెక్టర్‌గా, 98లో చిత్తూరు కలెక్టర్‌గా సేవలందించారు. 1999లో యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్, శాప్ ఎండీగా పనిచేశారు. 2000వ సంవత్సరంలో డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. 2005లో రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి ఎండీగా, 2007లో పరిశ్రమల శాఖ కమిషనర్‌గా, 2009లో మత్స్యశాఖ కమిషనర్‌గా సేవలందించారు. 2012లో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2014లో జీఏడీ ముఖ్య కార్యదర్శిగా, 2015లో వైటీసీఏ ముఖ్య కార్యదర్శిగానూ విధులు నిర్వర్తించారు. 2017లో కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2018లో టీఆర్అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, 2019లో రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.


Also Read: Andhra Pradesh: ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. అభ్యంతరాలపై అధికారులకు ప్రశ్నలు