Andhrapradesh Lands ReSurvey : ఆంధ్రప్రదేశ్లో భూముల రీ సర్వే నిర్వహణకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులతో కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. భూముల రీ సర్వే నిర్వహణకు సంబంధించి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దానికి కారణాలు ఏమిటనీ అధికారులను మంత్రి ప్రశ్నించారు. సాధారణంగా రీ సర్వే చేయించుకునేందుకు రైతులు ఆసక్తి చూపించాలని, అందుకు విరుద్ధంగా జరుగుతోందని ఈ సందర్భంగా మంత్రి అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. తనకు నిత్యం రీ సర్వేపై రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రజా దర్బార్ మాదిరిగానే భూ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి ప్రత్యేకంగా విజ్ఞప్తుల స్వీకరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన సర్వేపై భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ జి సాయి ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ మంత్రికి వివరించారు. 13,321 గ్రామాల్లో రీసర్వే సందర్భంగా డ్రోన్లతో 1.20 లక్షల చదరపు కిలోమీటర్లు సర్వేను పూర్తి చేసినట్లు వెల్లడించారు. 12,348 గ్రామాలకు చిత్రాలు పంపించినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. రైతుల ఆమోదంతో 7,110 గ్రామాల్లో సరిహద్దులు నిర్ణయించామని, 6,707 గ్రామాల్లో విస్తీర్ణం నిర్ధారణ చేశామన్నారు. 6,353 గ్రామాల్లో రీ సర్వే పూర్తయినట్లు నోటిఫికేషన్ ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. 6,316 గ్రామాల్లో రికార్డుల్లో నమోదు ప్రక్రియ పూర్తయిందని, సర్వే నెంబర్ల స్థానంలో 81 లక్షల ల్యాండ్ పార్సిల్లను జనరేట్ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. 8.64 లక్షల యజమానుల పేర్లను రికార్డులు అప్డేట్ చేశామని, 86 వేల వివాదాలు పరిష్కరించినట్లు వివరించారు. 22.48 లక్షల యజమానుల పేర్లను రికార్డుల్లో నమోదు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. 


క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే ఆన్లైన్లో నమోదు చేశారన్న మంత్రి 


అధికారుల వెల్లడించిన వివరాల పట్ల మంత్రి ఒకంత అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సర్వేయర్లు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే ఆన్లైన్లో వివరాలు నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రీ సర్వే నిర్వహణ తీరుపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయని మరోసారి అధికారులను ప్రశ్నించారు. సర్వేకు తక్కువ సమయం కేటాయించడం వల్ల పలు ఇబ్బందులు వచ్చాయని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరణ ఇచ్చారు. భూముల రి సర్వేకు సంబంధించి రైతుల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపైన ఉందన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, భూముల రీ సర్వే వల్ల ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకూడదని, నష్టం వచ్చిందన్న మాట వినిపించకూడదని మంత్రి స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో అర్హత కలిగిన వారిలో 34 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోలేదని అధికారులు మంత్రికి వివరించారు. వీరందరికీ సులువుగా ఉండేలా సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని తెలిపారు. వీరి వివరాలను వీఆర్వోల లాగిన్ కు పంపించామని అధికారులు మంత్రికి వివరించారు. సుమోటో కింద ఈ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామని భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్ మంత్రికి వివరించారు.