Income Tax Return Filing 2024: ప్రతి ఆర్థిక సంవత్సరం కొన్ని వేల మంది పన్ను చెల్లింపుదార్లు మొదటిసారి ఆదాయ పన్ను పత్రాలు (First time income taxpayer) సమర్పిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఫస్ట్‌ టైమ్‌ టాక్స్‌ పేయర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. జీవితంలో తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేసే వ్యక్తులు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. దీనివల్ల తప్పులు దొర్లే అవకాశం బాగా తగ్గుతుంది. సరైన ఐటీ ఫారాన్ని ఎంచుకోవడం, పన్ను విధించదగిన ఆదాయాన్ని లెక్కించడం వంటి కీలక విషయాల్లో పొరపాట్లు జరగవు.


మొదటిసారి ఐటీఆర్‌ ఫైల్ చేస్తున్న వ్యక్తులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:


1. పన్ను విధించదగిన ఆదాయం గణన ముఖ్యం
మీ స్థూల జీతం ఎంత అనేది సరిగ్గా లెక్కించడం చాలా ముఖ్యం. ఇందులో... మీ జీతంతో పాటు ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని (Income from other sources) కూడా చేర్చాలి.


2. కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం
పస్తుతం, కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం రెండూ అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెండింటిలో ఒకదానిని ఎంచుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి. రెండు విధానాల్లోని పన్ను ప్రయోజనాల గురించి సరిగ్గా అర్ధం చేసుకోండి. దీనికోసం ఆన్‌లైన్ టాక్స్‌ కాలిక్యులేటర్ సాయం కూడా తీసుకోవచ్చు. ఈ ఏడాది నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఆప్షన్‌గా కనిపిస్తుందని గుర్తుంచుకోండి. మీరు రెండు ఆప్షన్లలో దేనినైనా ఎంచుకోకపోతే, మీ రిటర్న్ కొత్త పన్ను విధానంలో దాఖలవుతుందని గుర్తుంచుకోండి.


3. ఫారం-16 మీ దగ్గర ఉండాలి
ప్రతి కంపెనీ, తన ఉద్యోగులకు జూన్ 15 నాటికి ఫారం-16 జారీ చేస్తుంది. ఈ ఫారంలో, ఉద్యోగి స్థూల జీతంతో పాటు పన్ను విధించదగిన ఆదాయం, TDS, పన్ను మినహాయింపు వంటి కీలక సమాచారం నమోదై ఉంటుంది. ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి ఈ వివరాలన్నీ అవసరం.


4. ఫారం 26ASని సమీక్షించండి
మొదటిసారి ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే వ్యక్తులు ఫారం 26ASను తనిఖీ చేయడం కూడా చాలా ముఖ్యమే. ఈ ఫారాన్ని ఆదాయ పన్ను విభాగం అధికారిక పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఆదాయంతో పాటు, కట్‌ చేసిన TDS వివరాలు కూడా ఇందులో ఉంటాయి. ఫారం 26ASలోని వివరాలను ఫారం 16లోని వివరాలతో పోల్చి చూడాలి.


5. యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ తనిఖీ
వార్షిక సమాచార ప్రకటన లేదా యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ను (AIS) తనిఖీ కూడా తనిఖీ చేయాలి. దీని ద్వారా... బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, డివిడెండ్స్‌, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు, విదేశీ చెల్లింపులు, 'ఇతర వనరుల నుంచి ఆదాయాల' గురించి సమాచారం తెలుసుకుంటారు. ఈ పత్రాన్ని కూడా ఆదాయ పన్ను విభాగం అధికారిక పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


6. సరైన ఐటీ ఫారం ఎంచుకోవాలి
వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్ల కోసం ఆదాయ పన్ను విభాగం ITR-1 నుంచి ITR-4 వరకు నాలుగు రకాల ఫారాలను జారీ చేస్తోంది. వేతన జీవులు ITR-1 లేదా ITR-2 ఎంచుకోవచ్చు. రూ.50 లక్షల కంటే తక్కువ వార్షిక జీతం ఉన్న వ్యక్తులు ITR-1 ఎంచుకోవచ్చు. దీనిని సహజ్ అని కూడా పిలుస్తారు. దీంతో పాటు, ఆ వ్యక్తికి ఒకే నివాస ఆస్తి ఉండాలి, వ్యవసాయ ఆదాయం రూ. 5000 మించకూడదు. రూ.50 లక్షల కంటే ఎక్కువ వార్షిక జీతం ఉన్న వ్యక్తులు ITR-2 ఎంచుకోవచ్చు. ఈ ఆదాయం వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం కాకూడదని గుర్తుంచుకోండి.


7. ఈ పత్రాలు అవసరం
ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. మీకు పెట్టుబడులు ఉంటే వాటికి సంబంధించిన రుజువు పత్రాలు, గృహ రుణం తీసుకుని ఉంటే ఇంట్రస్ట్‌ సర్టిఫికేట్ అవసరం.


8. ITR ధృవీకరణ
ఆదాయ పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడంతోనే పని పూర్తి కాదు. ఫైల్‌ చేసిన నాటి నుంచి 30 రోజుల్లోపు దానిని వెరిఫై చేయాలి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో వెరిఫై చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం: సుందర్‌ పిచాయ్‌ మామూలోడు కాదు - గూగుల్‌ను ఓ ఆట ఆడించాడు