Income Tax Expectations From Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, వచ్చే నెలలో కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, నిర్మలమ్మ పద్దు మీద వేతన జీవులు ఆశలు పెట్టుకున్నారు. పన్ను రేట్లు తగ్గించడం, స్లాబ్‌లు మార్చడం, ఎక్కువ డిడక్షన్స్‌ వంటి ఉపశమనాలను ఆశిస్తున్నారు. 50% హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) మినహాయింపు జాబితాలోకి మరికొన్ని నాన్-మెట్రో నగరాలను చేర్చడం కూడా ప్రజలు కోరుకునే వరాల్లో ఒకటి.


కంపెనీ యాజమాన్యాలు తమ ఉద్యోగులకు అందించే కాంపెన్షేషన్‌ ప్యాకేజీలో HRA కూడా ఒక భాగం. హెచ్‌ఆర్‌ఏ పొందుతూ ఇంటి అద్దె చెల్లిస్తున్న ఉద్యోగులు, పాత పన్ను పద్ధతిలో ITR ఫైల్‌ చేస్తే, HRA మీద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఆ ఉద్యోగి మెట్రో నగరంలో నివసిస్తున్నాడా, లేడా అన్న విషయంపై పన్ను మినహాయింపు మొత్తం ఆధారపడి ఉంటుంది. HRA తీసుకుంటున్న ఉద్యోగి అద్దె ఇంట్లో ఉండకపోతే, ఆ అలవెన్స్‌ మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది.


ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 10(13A) ప్రకారం ఉద్యోగులకు HRAపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ కింది వాటిలో ఏ మొత్తం తక్కువ అయితే, దానిని క్లెయిమ్‌ చేయవచ్చు:


1. ఉద్యోగి అందుకున్న మొత్తం హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌
2. వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి బేసిక్‌ శాలరీలో 10%ను తీసివేయగా వచ్చిన మొత్తం
3. బేసిక్‌ శాలరీసో 50% (మెట్రో నగరాలకు)/ బేసిక్ శాలరీలో 40% (నాన్‌-మెట్రో నగరాలకు).


4 నగరాల్లోనే 50% మినహాయింపు
ప్రస్తుతం.. దిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలోని అద్దె ఇంట్లో ఉంటున్న ఉద్యోగులు HRA నుంచి 50% మినహాయింపునకు అర్హులు. ఇతర ప్రదేశాలలో ఉన్నవాల్లు 40% కేటగిరీ కిందకు వస్తారు. అయితే... దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ కొలమానాన్ని తీసుకొచ్చారు. ఈ 30 సంవత్సరాల్లో... జనాభా & ఆర్థిక వృద్ధి పరంగా నగరాలు విస్తరించాయి. కాబట్టి మెట్రో & నాన్-మెట్రో నగరాల నిర్వచనాన్ని మార్చాల్సిన అవసరం ఉంది.


హైదరాబాద్‌ కూడా మెట్రో సిటీ అయినప్పటికీ 40% మినహాయింపే
ఆసక్తికరమైన విషయం ఏంటంటే... రాజ్యాంగ (74వ సవరణ) చట్టం 1992 ప్రకారం... జాతీయ రాజధాని ప్రాంతం (NCR), బెంగళూరు, పుణె, హైదరాబాద్‌ను కూడా మెట్రో నగరాలుగా గుర్తించారు. అయినప్పటికీ, మూడు దశాబ్దాల క్రితం నాటి నిబంధన కారణంగా, ఈ నగరాల్లో నివశిస్తున్న వేతన జీవులకు HRA పన్ను మినహాయింపు 40% వద్దే ఉంది. దీనివల్ల, జీతపు ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తోంది. 


వేగంగా అభివృద్ధి చెందుతున్న నాన్-మెట్రో నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులు, వేగవంతమైన పట్టణీకరణ కారణంగా అధిక అద్దెలు చెల్లిస్తున్నారు. అయితే, మెట్రో నగరాలతో పోలిస్తే ఇంటి అద్దె విషయంలో తక్కువ పన్ను ప్రయోజనాలు పొందుతున్నారు. ఉపాధి కోసం మెట్రోయేతర నగరాలకు తరలివెళ్లే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఫలితంగా ఎక్కువ మంది పన్ను చెల్లింపుదార్లపై ఆర్థికంగా ఒత్తిడి పడుతోంది. ఈ ఒత్తిడిని తగ్గించడానికి & గరిష్ట అద్దె మినహాయింపును క్లెయిమ్ చేయడానికి మెట్రో నగర నిర్వచనాన్ని & పాత నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉంది.


మరో ఆసక్తికర కథనం: ఐటీఆర్‌ ఫైల్‌ చేసే సీనియర్ సిటిజన్స్ - ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!