ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. ఘర్షణ వాతావరణం వద్దని రెండు వర్గాలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్రమంగా ఒకరి తర్వాత ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకోవడం ప్రారంభించారు.  ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు  హెచ్చరికలు జారీ చేయడం.. ఊరూ పేరూ లేని సంఘాలతో చర్చలు జరపడం ఉద్యోగ సంఘాలను ఆగ్రహానికి గురి చేస్తోంది. వారు కూడా మంత్రులకు ధీటుగా స్పందిస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య దూరం అంతకంతకూ పెరిగిపోతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


ఉద్యోగుల విషయంలో మంత్రుల హెచ్చరిక ప్రకటనలు !


ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నచ్చ చెప్పేందుకు ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రతి రోజూ సచివాలయంలో సమావేశం అవుతోంది. ఉద్యోగ సంఘాల నేతలు వస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ ఎవరూ రావడం లేదు. పీఆర్సీ జీవోలను రద్దు చేసి.. ఈ నెలకు పాత జీతాలు ఇస్తే చర్చలకు వస్తామంటున్నారు. కానీ తాము చేసేది చేస్తాం.. కానీ ఉద్యోగులు అడిగే ఎలాంటి డిమాండ్‌ను పరిష్కరించే ప్రశ్నే లేదని చెబుతున్నారు. ప్రతీ రోజూ మీడియాతో మాట్లాడుతున్న  ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బొత్స ఉద్యోగులపై కాస్త కఠినమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఓ సారి..  చర్చలకు ఎవరు వచ్చినా జరుపుతామని మరోసారి ప్రకటనలు చేశారు. శుక్రవారం బొత్స సత్యనారాయణ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులను అలుసుగా తీసుకోవద్దని హెచ్చరించారు. 


మంత్రులు, సలహాదారుకు ధీటుగా బదులిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు !


మంత్రుల హెచ్చరికలకు ఉద్యోగ సంఘాల నేతలు ధీటుగా బదులిస్తున్నారు. ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా, ఏ చిన్న సంఘం వచ్చినా చర్చలు జరుపుతున్నారని  పెయిడ్‌ ఆర్టిస్టులను తయారు చేసి, వారితో చర్చలు జరపడం కరెక్ట్‌ కాదని ఎపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రభుత్వం ఏం చేసినా ఉద్యమం మాత్రం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల బిల్లులు ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్న  ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై సచివాలయ ఉద్యోగ సంఘం నేత  వెంకట్రామిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక్కరిపై చర్యలు తీసుకున్నా..  తక్షణం సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఇలా మాటకు మాట అటు ప్రభుత్వ ప్రతినిధులు..ఇటు ఉద్యోగ సంఘాల మధ్య పెరుగుతూనే ఉంది.  


ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగితే సమస్య పీటముడి పడినట్లే !


ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించినప్పుడు కూడా ఉద్యోగ సంఘాల నేతలందరూ చప్పట్లు కొట్టారు. కానీ అప్పుడు హెచ్‌ఆర్ఏతో పాటు మరికొన్ని అలవెన్స్‌ల విషయంలో క్లారిటీ లేదు. తర్వాత ఉద్యోగ సంఘాలు ఎంత బతిమాలినప్పటికీ ప్రభుత్వం తాము అనుకున్నట్లుగా అర్థరాత్రి జీవోలు ఇచ్చేసింది. దీంతో ఉద్యోగ నేతలు ప్రభుత్వం తమను అవమానించిందని భావిస్తూ ఉద్యమ షెడ్యూల్ ప్రకటించారు.  రెండు వర్గాలూ తమ తమ వాదనల విషయంలో పట్టు వీడే ప్రసక్తి లేకపోవడంతో సమస్యకు ఎక్కడ పరిష్కారం లభిస్తుందన్నది క్వశ్చన్ మార్క్‌గా మిగిలిపోతోంది. ఈ మధ్య ప్రభుత్వం - ఉద్యోగుల మధ్య గ్యాప్ పెరిగిపోవడం మరింత ఆందోళనకమైన అంశంగా భావిస్తున్నారు.