Floating Solar Power Plant In AP : గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మరో వినూత్న ఆలోచన చేసింది. విశాఖపట్నంలోని మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ లో తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్‌ను శుక్రవారం ప్రారంభించారు. జీవీఎంసీ కమిషనర్ జి.లక్ష్మీ షా మాట్లాడుతూ ఈ సోలార్ పవర్ ప్లాంట్ ప్రతి ఏడాది 4.2 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదని తెలిపారు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ను ప్రారంభించామన్నారు. దీంతో సంవత్సరానికి 54,000 టన్నుల బొగ్గును ఆదా అవుతుందన్నారు. సంవత్సరానికి 3,022 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తున్నామని లక్ష్మీ షా  చెప్పారు. 






దేశంలోనే అతి పెద్ద ప్లాంట్ 


దేశంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఉంది. ఈ 100 మెగావాట్ల (MW) ప్లోటింగ్ సోలార్ పవర్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్ట్ ను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ప్రారంభించింది.  రామగుండం వద్ద NTPC రిజర్వాయర్‌లో 500 ఎకరాలలో 100 MW ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను రూ.423 కోట్ల వ్యయంతో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ద్వారా EPC (ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణం) ఒప్పందంపై నిర్మించారు. 



వాటర్ బాడీస్ ఉపరితలంపై 


సోలార్ ప్లాంట్లు లేదా సోలార్ ఫారమ్‌లు నేలపై అమర్చవచ్చు లేదా వాటర్‌బాడీస్ ఉపరితలంపై ఏర్పాటు చేయవచ్చు. ఈ తేలియాడే సోలార్ ప్లాంట్లు భూ ఉపరితలాలపై అమర్చిన సంప్రదాయక ప్యానల్స్ కంటే కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ, ప్రయోజనాలు అధికంగా  ఉంటాయి.  పెద్ద భూభాగాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో తేలియాడే ఫోటోవోల్టాయిక్ ప్యానెల్స్  ఏర్పాటు చేయవచ్చు. వీటి కోసం ఎక్కువ భూమిని సేకరించాల్సిన అవసరం లేదు. దిగువన నీరు ఉండటం వల్ల అవి చల్లగా ఉండటానికి సహాయపడతాయి కాబట్టి అవి మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవి నీటి ఆవిరిని కూడా తగ్గిస్తాయి. దీంతో జలవిద్యుత్ ఉత్పత్తికి ఎక్కువ నీరు ఆదా అవుతుంది.