Andhra News:  అడవి పందులను చూసి బెదిరిపోయిన వందలాది ఆవులు తెలుగు గంగ జలాశయంలోకి దూకాయి. ఈ ఘటన నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద చోటు చేసుకుంది. వాటిలో 400 ఆవులను మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో 50 ఆవులు గల్లంతు అయ్యాయి. వెలుగోడుకు చెందిన మల్లయ్య, శంకర్, వెంకట రమణ, కూర్మయ్య, పెద్ద స్వామి, బాలలింగం, ఈశ్వర్, బూరుగయ్య, సాంబకోటిలు.. గ్రామానికి చెందిన పలువురి ఆవులను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. 


ఆవుల మందపై ఆధారపడి జీవిస్తున్న పశువుల కాపర్లు..


అయితే చాలా మంది వీరికి తమ ఆవులను మేపమని చెప్పి నెలక కొంత మొత్తంలో డబ్బు ఇస్తుంటారు. అలా మొత్తం వెయ్యి ఆవులను మేపుతూ వీరంతా జీవనం సాగిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం లాగానే ఆవుల యజమానులు ఆవులను మందలోకి పంపి ఇళ్లకు వెళ్లిపోయారు. మల్లయ్య, శంకర్, వెంకట రమణ, కూర్మయ్య, పెద్ద స్వామి, బాల లింగం, ఈశ్వర్, బూరుగయ్య, సాంబ కోటిలు పశువులను మేత కోసం.. గ్రామ సమీపంలోని తెలుగు గంగ జలాశయం పక్కన ఉన్న మైదాన ప్రాతానికి తీసుకువచ్చారు. అక్కడే ఆవుల మందను నిలపగా.. అవి గడ్డి తింటూ అక్కడక్కడే తిరిగాయి.


పందుల గుంపు రావండోతనే ఆవులు ఆగమాగం..


ఇలా ఓ రెండు మూడు గంటలు గడిచే సరికి... అటు వైపు నుంచి ఓ పందుల గుంపు పరుగులు తీస్తూ వచ్చింది. వాటని గమనించిన ఆవులు తీవ్రంగా భయపడిపోయాయి. వెయ్యి ఆవుల మంద అటూ, ఇటూ పరిగెత్తడం ప్రారంభించాయి. పశువుల కాపర్లు విషయం అర్థం చేసుకునే లోపే 500 ఆవులు జలాశయం కట్టపైకి చేరాయి. 50 వరకు అడవిలోకి పరుగులు తీశాయి. వీటి వెనుకే పశువుల కాపర్లు కూడా పరిగెత్తారు. కానీ వాళ్లు కట్టపైకి చేరేలోపే 450 ఆవులు జలాశయంలోకి దూకేశాయి. అది చూసిన పశువుల కాపర్లు.. వెంటనే విషయాన్ని యజమానులకు, స్థానిక ప్రజలు తెలియజేశారు. 


సురక్షితంగా ఒడ్డుకు చేరిన 400 ఆవులు..


హుటాహుటిన గ్రామస్థులు, ఆవుల యజమానులు జలాశయం వద్దకు చేరుకున్నారు. మత్స్యకారులకు కూడా సమాచారం అందడంతో.. నాటు పడవలు, పుట్టిలతో రంగంలోకి దిగారు. యజమానులంతా ఆ నాటు పడవలు, పుట్టిల్లో జలాశయంలోకి వెళ్లి ఆవులను కాపాడే ప్రయత్నం చేశారు. అలా చాలా మంది కలిసి మొత్తం 400 ఆవులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే మరో 50 ఆవులు గల్లంతు అయ్యాయి. ఇప్పటికీ వాటి ఆచూకీ లభించలేదు. అయితే స్థానిక ప్రజల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఘటనా స్థాలానికి వచ్చారు.


కన్నీరుమున్నీరవుతున్న ఆవుల యజమానులు.. 


సీఐ, ఎస్సైలు జలాశయంలోకి పుట్టిపై వెళ్లి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. అయితే ప్రమాద ఘటనలో యజమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ ఆవులు సురక్షితంగా ఒడ్డున పడ్డ వాళ్లు కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ... గల్లంతైన ఆవుల యజమానులు మాత్రం కన్నీరుమున్నీరు అవుతున్నారు. వాటిపైనై ఆధారపడి జీవిస్తున్న తమ జీవితాలు ఏమైపోతానంటూ కుమిలిపోతున్నారు.