ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 4వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. అయితే కర్ఫ్యూ సమయాన్ని మరో గంట సడలింపు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. రాత్రి 10 గంటలకు బదులుగా 11 గంటల వరకూ సడలింపు సమయాన్ని పెంచినట్టు తెలిపారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఉత్తర్వులు జారీచేశారు.
రాత్రి కర్ఫ్యూలో మార్పులు
ఏపీ సీఎం జగన్ కరోనా వ్యాప్తి, కర్ఫ్యూపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం సీఎం జగన్ ఆదేశాలు మేరకు రాత్రి కర్ఫ్యూ పెంచినట్లు అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. కర్ఫ్యూ అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులకు అనుగుణంగా రాత్రి పూట కర్ఫ్యూ సమయంలో మార్పులు చేసినట్టు వెల్లడించారు.
Also Read: AP BJP : జగన్‌తో కిషన్ భేటీపై ఏపీ బీజేపీ నేతల్లో కలవరం ఎందుకు..?
థర్డ్ వేవ్ నేపథ్యంలో
కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంతో ఏపీ సర్కార్ తగిన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే మళ్లీ రాత్రి కర్ఫ్యూ పొడిగించింది. అలాగే కరోనా నిబంధనలపై అధికారులకు ఆదేశాలు జారీచేసింది. రోడ్లపైకి వచ్చే జనాలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపింది.
Also Read: Covid-19 Vaccine for Kids: త్వరలోనే పిల్లలకు 'జాన్సన్ అండ్ జాన్సన్' సింగిల్ డోస్ వ్యాక్సిన్
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నా కొన్ని జిల్లాల్లో మాత్రం కేసులు అదుపులోకి రావట్లేదు. దీనిపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి సమయంలో కరోనా ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కరోనా కేసులు
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1435 కరోనా కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 1695 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 15472 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 24 గంటల వ్యవధిలో 69,173 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. కరోనాతో ప్రకాశం, చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు.