జన ఆశీర్వాద్ యాత్ర కోసం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనూహ్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో భేటీ కావడం రాజకీయవర్గాల్లో సంచలనం రేకెత్తించింది. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ వచ్చినందున సీఎం జగన్ తనను మర్యాదపూర్వక భేటీకి ఆహ్వానించారని కిషన్ రెడ్డి భేటీ తర్వాత మీడియాకు చెప్పారు. ఆ తర్వాత సీఎంవో  కూడా కొన్ని ఫోటోలను విడుదల చేసింది. సతీ సమేతంగా సీఎం క్యాంపాఫీస్‌కు వెళ్లిన కేంద్రిమంత్రి అక్కడ భోజనం చేసి ఆ తర్వాత మళ్లీ విజయవాడలో జరిగిన జన ఆశీర్వాద్ యాత్రలో పాల్గొన్నారు. 


జన ఆశీర్వాద్ యాత్రలో జగన్ మోహన్ రెడ్డితో భేటీకి ముందు తిరుపతిలో ప్రసంగించారు. భేటీ తర్వాత విజయవాడలో ప్రసంగించారు. రెండు చోట్ల కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు. తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం అర్థికంగా ఇక్కట్లలో కూరుకుపోయిందని అయితే జీతాలు.. లేకపోతే పథకాలు అమలు చేయాల్సిన దుస్థితికి వచ్చిందన్నారు. కేంద్ర పథకాలు తప్ప ఏపీలో ఏమీ అమలు కావడం లేదున్నారు. అభివృద్ధి అనేదే జరగడం లేదన్నారు. ఏపీ బీజేపీ నేతలు కూడా దీన్నే కోరుకున్నారు. బీజేపీ, వైసీపీ ఒకటే అనే ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే ఈ మాత్రం దూకుడు ఉండాలనుకున్నారు. 


అయితే ఆయన ఆ విమర్శలు చేసిన కాసేపటికే ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. జనఆశీర్వాద్ యాత్ర టూర్‌లో జగన్‌తో భేటీ ఉంటుందని బీజేపీ నాయకులు కూడా అనుకోలేదు. ఎందుకంటే జన ఆశీర్వాద్ యాత్ర బీజేపీ పార్టీ పరమైనది. అధికారిక పర్యటన కాదు. పార్టీ కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు ప్రత్యర్థిగా భావిస్తున్న పార్టీ నేతలతో మర్యాదపూర్వక భేటీలు జరిపినా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే అలాంటి భేటీ ఉండదని ఏపీ బీజేపీ నేతలు అనుకున్నారు. అధికారిక షెడ్యూల్‌లోనూ సీఎంతో భేటీ అంశం లేదు. కానీ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి నేరుగా జగన్ ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికీచాలా మందికి తెలియదు. సీఎంవో ఫోటోలు విడుదల చేసిన తర్వాత మాత్రమే భేటీ గురించి అందరికీ తెలిసింది. 


జనఆశీర్వాద్ యాత్రలో  ప్రభుత్వంపై చేసిన ఘాటు విమర్శలన్నీ  జగన్‌తో భేటీ తర్వాత లైట్‌గా మారిపోయాయని ఏపీ బీజేపీ నేతలు మథనపడుతున్నారు. కేంద్రమంత్రిగా అధికారిక పర్యటనకు వచ్చి.. జగన్‌తో భేటీ అయితే రాజకీయంగా ఇంపాక్ట్ ఉండేది కాదు కానీ రాజకీయ యాత్ర కోసం వచ్చి భేటీ కావడం వల్ల బీజేపీపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డి వ్యూహాత్మక తప్పిదం చేశారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.