CM Jagan Comments: మాండూస్ తుపాన్, భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జిల్లా కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఎన్యుమరేషన్ విషయంలో ఉదారంగా వ్యవహరించండని అన్నారు. ఎక్కడా కూడా రైతులు నిరాశకు గురికాకూడదన్నారు. అలాగే రంగుమారిన ధాన్యం అయినా, తడిసిన ధాన్యం అయినా కొనుగోలు చేయలేదన్న మాట ఎక్కడా రాకూడదన్నారు. తక్కువ రేటుకు కొంటున్నారన్న మాట ఎక్కడా వినిపించకూడదని సూచించారు.
రెండు వేల రూపాయలతో పాటు రేషన్ అందించాలి..
ఒకవేళ రైతులు తాము బయట అమ్ముకుంటున్నామన్నా సరే కూడా వారికి రావాల్సిన రేటు వారికి రావాలని సీఎం జగన్ అన్నారు. ఆ ధర వచ్చేలా చూడాల్సిన బాధ్యత కూడా మనదేనన్నారు. తుఫఆన్, దీని ప్రభావం వల్ల కుర్షాలు కురిసిన జిల్లాల్లో కలెక్టర్లు అందరూ దీని కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు. పంటలు దెబ్బతిన్న చోట మళ్లీ పంటలు వేసుకోవడానికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలన్నారు. ఎక్కడైనా ఇళ్లు ముంపుకు గురైతే.. ఆ కుటుంబానికి రెండు వేల రూపాయలతో, రేషన్ అందించాలన్నారు. ఇంట్లోకి నీళ్లు వచ్చినా సరే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే మాట రాకూడదన్నారు. ఇంట్లోకి నీళ్లు వస్తే.. కచ్చితంగా వారికి సాయం చేయాలన్నారు. ఈ విషయాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు గుర్తుంచుకోవాలని సీఎం జగన్ చెప్పారు.
ఎక్కడ పశువులకు నష్టం జరిగినా చర్యలు చేపట్టాలి..
పట్టణాలు, పల్లెలతో సంబంధం లేకుండా ఈ విషయాన్ని బాధితులందరికీ అందించాలన్నారు. గోడకూలి ఒకరు మరణించారన్న సమాచారం వచ్చిందని చెప్పారు . వారికి కూడా వెంటనే నష్ట పరిహారం అందించాలన్నారు. వారం రోజుల్లో ఈ సహాయం అంతా వారికి అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా పశువులకు నష్టం జరిగినా సరే వారికి కూడా పరిహారం సత్వరమే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నష్ట పరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలని సూచించారు. వచ్చే వారం రోజుల్లో ఈ ప్రక్రియ ముగించాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్న తుఫాన్ ప్రభావం..
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుపాను సిక్కోలు రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. చేతికి అందిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానాపాట్లు పడుతున్నారు. ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయన్న అధికారుల సమాచారంతో మరింత ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను పరుగులు పెట్టిస్తున్నాయి. పొలాల్లో కోసిన వరిని, కల్లాల్లో నూర్చేందుకు రెడీ చేసిన పంటను కాపాడుకోవడానికి శ్రమిస్తున్నారు. పండిన పంటను కోతలు కోసి కుప్పలుగా పేరుస్తున్నారు. కుప్పలపై టార్పా లిన్లు కప్పి సంరక్షించుకుంటున్నారు. కల్లాల్లో ఇప్పటికే కోసి ఆర బోసిన ధాన్యం రాశులను బస్తాల్లో ఎత్తి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ ఆన్లైన్ పద్ధతి లో కొనుగోలు చేసి నగదు కూడా అదే పద్ధతిన వారి ఖాతాల్లో వేయాలని పక్కా ప్రణాళికలను సిద్ధం చేసింది. దీనిపై గత కొద్ది రోజులుగా జిల్లా యంత్రాంగం సచివాలయ సిబ్బందికి తర్ఫీదు ఇచ్చినప్పటికీ సాంకేతిక లోపాల నుంచి బయట పడలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చిన తుపాను రైతులను నిలువునా ముంచేసింది. రెండు రోజులుగా జిల్లా అంతట చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి.