జీఎస్టీ కింద గత ఏడాది నవంబర్‌ లో కేంద్రం రాష్ట్రాలకు రూ. 17 వేల కోట్లు విడుదల చేసింది. అందులో ఏపీ వాటా కింద రూ.543 కోట్లు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి రాజ్యసభలో వెల్లడించారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏప్రిల్‌ 2020 నుంచి మార్చి 2021 మధ్య జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు విడుదల చేసిన రూ.1,13,464 కోట్లకు ఇది అదనం అని తెలిపారు. 2017లో జీఎస్టీ చట్టం అమలులోనికి వచ్చినప్పటి నుంచి 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాలను పూర్తిగా విడుదల చేశామని తెలిపారు. 


జాతీయ బ్యాంకుల్లో రూ.57,479 కోట్ల అప్పులు


ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో కూరుకుపోతుందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం బ్యాంకుల్లో తీసుకున్న అప్పులెంతో లెక్కచెప్పాలని టీడీపీ ఎంపీ కనకమేడల పార్లమెంట్ లో ప్రశ్నించారు. దీనిపై కేంద్రం సమాధానం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్లు అప్పు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ రాజ్యసభలో తెలిపారు. టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు అప్పులు ఇచ్చాయని తెలిపారు. అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని కేంద్రమంత్రి అన్నారు. 2019 నుంచి 2021 నవంబరు వరకూ నేషనల్ బ్యాంకులు ఈ రుణాలు ఇచ్చినట్లు తెలిపారు.


Also Read: ఏపీ ఉద్యోగసంఘాల మధ్య చీలిక.. ప్రభుత్వంపై నమ్మకం ఉందంటున్న కొన్ని సంఘాలు !


ఏ బ్యాంకు నుంచి ఎంత రుణం


స్టేట్ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 9 సంస్థలకు రూ.11,937 కోట్లు రుణం ఇచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఐదు కంపెనీలు, కార్పొరేషన్లకు రూ.10,865 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 సంస్థలకు రూ.7వేల కోట్లు రుణం ఇచ్చాయి. కెనరా బ్యాంకు రూ.4,099 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రూ.750 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.2,970 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.5,500కోట్లు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ రూ.1,750 కోట్ల రుణాలు ఇచ్చాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.5,633 కోట్లు, యూనియన్ బ్యాంకు రూ.6,975 కోట్ల రుణాలు మంజూరు చేశాయి.  


Also Read: పథకాల అమలు.. అభివృద్ధిలో తోడుగా రండి.. బ్యాంకర్లకు సీఎం జగన్ పిలుపు !


రెండేళ్లలో రూ.1.45 లక్షల కోట్ల అప్పులు


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయానికి ఏపీ అప్పులు రూ. 97,123 కోట్లుగా ఉన్నాయి. ఈ అప్పులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,62,225 కోట్లకు చేరాయి. గత రెండేళ్లలో అప్పులు మరింత పెరిగి ఆగస్టుకు మొత్తం రూ. 3,73,140 కోట్లకు చేరింది. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం అయిదేళ్లలో రూ. 1.65 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెండేళ్లలో రూ. 1.45 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఏపీలో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లతో పాటుగా పాత అప్పులకు వడ్డీలు చెల్లించడానికి ప్రతీ నెలా అప్పులు చేస్తున్నారు. వేతనాలు, పింఛన్ల కోసం నెలకు రూ. 5,500 కోట్లు అవసరం అవుతున్నాయి. ఇక వడ్డీలు, పాత అప్పులు తీర్చాల్సిన వాటికి గానూ ప్రతి నెలా మరో రూ. 3,500 కోట్లు కావాలి. నెలా నెలా కొత్తగా చేస్తున్న రూ. 5 వేల కోట్లకు పైగా అప్పు ఈ రెండింటికే చాలని పరిస్థితి నెలకొంది. 


Also Read: ఇసుక లారీలను అడ్డుకున్న నందలూరు గ్రామస్తులు... ఇసుక మాఫియా కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టారని ఆరోపణ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి