Andhra Pradesh Cabinet Dissolved: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సీఎం జగన్ కు లేఖలు అందజేశారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ చివరి సమావేశం ముగిసింది. ఈ భేటీలో 36 అంశాలపై కేబినెట్ చర్చించింది. ఈ సమావేశంలో మిల్లెట్‌ మిషన్‌ పాలసీ, డిగ్రీ కళాశాలల్లో 574 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ వంటి తదితర ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చివరి కేబినెట్‌ భేటీలో కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదించింది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి కేబినెట్ అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసింది. విజయ్‌కుమార్‌ను సీఎం జగన్‌ తో సహా కేబినెట్‌ మంత్రులు అభినందించారు. మంత్రుల్లో ఐదు, ఆరుగురికి తిరిగి అవకాశం లభించే అవకాశం ఉందని మంత్రి కొడాలి నాని అన్నారు.



ఈ రాత్రికే రాజీనామాలు ఆమోదం 


మంత్రులు రాజీనామా లేఖలను కాసేపట్లో జీఏడీ అధికారుల ద్వారా గవర్నర్ కార్యాలయానికి పంపనున్నారు. ఈ రాత్రికే రాజీనామాలు ఆమోదించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 10న కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు సీఎం జగన్ పంపనున్నారు. కేబినెట్ చివరి సమావేశం కావడంతో కీలక అంశాలను ఆమోదించారు. 



కొడాలి నాని స్పందన 


మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ తాను కూడా అంద‌రి మాదిరిగానే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని ఆయ‌న తెలిపారు. మంత్రి వ‌ర్గ పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో ఐదు, ఆరుగురికి మళ్లీ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంటుంద‌న్నారు. మంత్రి వర్గంలో కొడాలి నానికి స్థానం ఉంటుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. నాకు నాలుగు కొమ్ములేమీ లేవ‌ని కొడాని నాని అన్నారు. కొత్త కేబినెట్‌లో త‌న‌కు అవ‌కాశాలు త‌క్కువేన‌న్నారు. కేబినెట్ భేటీలో సీఎం ఆదేశాల మేర‌కు మంత్రులందరూ రాజీనామా చేశామ‌న్నారు. ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుంద‌ని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తుంటే సీఎం జ‌గ‌న్ ఎక్కువ‌గా బాధ ప‌డిన‌ట్టుగా క‌నిపించింద‌న్నారు. అనుభవం రీత్యా కొంతమంది మంత్రులను కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారన్నారు. కానీ ఎవరిని కొనసాగిస్తున్నారో చెప్పలేదన్నారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా తీసుకుంటామన్నారు. కొత్త కేబినెట్‌లో తాను ఉండే అవకాశం తక్కువే అని కొడాలి నాని అన్నారు. సామాజిక సమీకరణల కారణంగా పాత మంత్రుల్లో 5 లేదా 6 మంది కొనసాగే అవకాశం ఉందన్నారు. కొత్త కేబినెట్‌ ద్వారా ప్రజల వద్దకు వెళ్లాలనేది సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్ష అన్నారు. 


సీఎం జగన్ మాట్లాడుతూ 


మంత్రుల రాజీనామా సమయంలో సీఎం జగన్ మాట్లాడుతూ... అందరి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలి విడత అవకాశం ఇచ్చామన్నారు. ఇప్పుడు మీరంతా పార్టీ బాధ్యతల్లోకి వెళ్తారన్నారు. మీకున్న  అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించాలని మంత్రులతో సీఎం జగన్‌ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.