Anantapur News : అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున కదిరి ప్రాంతానికి చెందిన ఓ గర్భిణీ తీవ్ర అవస్థలు పడింది. కదిరి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని మరో కారు ఢీకొనడంతో గాయపడిన గర్భిణీని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి బుధవారం తెల్లవారుజామున ఒంటిగంటకు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేరుకుంది. వైద్యం అందించాల్సిన వైద్యులు గైర్హాజరు కావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో నర్సులే చిన్నపాటి ప్రథమ చికిత్స చేసి వార్డులలో సిబ్బంది లేరని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించేశారు. మీకు ఇబ్బందిగా అనుకుంటే కర్నూలు వెళ్లాలని లేకపోతే ప్రైవేటు వైద్యశాలకు వెళ్లాలని నర్సులు ఉచిత సలహాలు ఇచ్చారు.
కనీసం బెడ్ కూడా కేటాయించని పరిస్థితి
తమకు వైద్యం అందించాలని బాధితులు కోరారు. ఒకవేళ వైద్యులు లేకపోతే తమకు ఉదయం వరకు బెడ్ కేటాయించాలని కోరగా అక్కడి సిబ్బంది ససేమిరా అంటూ వారిని ఆసుపత్రి నుంచి బయటకు పంపించేశారు. గర్భిణీ వారి బంధువులు ఎంత వేడుకున్నా కనీసం వారికి చికిత్సలు అందించే వారే కరవయ్యారు. ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు మాత్రం ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవని స్థానికలు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తరచూ చోటుచేసుకుంటున్నాయి అంటున్నారు. ప్రభుత్వ వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటున్నారు.
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉన్నతాధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం రావడం లేదు. వైద్యం కోసం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రభుత్వ ఆసుపత్రి గేటు వద్దే గడిపిన ఆ గర్భిణీ అనంతరం తప్పని పరిస్థితుల్లో వేరే వాహనం ద్వారా తన గ్రామానికి వెళ్లిపోయింది. తమకు న్యాయం చేయాలంటూ గర్భిణీ కుటుంబ సభ్యులు వేడుకున్న పట్టించుకునే నాథుడే లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసర విభాగంలో ఉండాల్సిన వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండంతో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఆయా సమయాల్లో ఉండాల్సిన వైద్యులు ఎటువెళ్తున్నారో తెలియని అగమ్య గోచరమైన పరిస్థితి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిత్యం కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం దాని గురించి పట్టించుకోకపోవడం వల్లే ఇలా ఇష్టారాజ్యంగా వైద్యులు విధులు నిర్వహిస్తున్నారని రోగులు వాపోతున్నారు. ఈ విషయంపై సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధిత గర్భిణీ బంధువులు కోరుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే వారెవరూ స్పందించలేదు.