Andhra Pradesh American Association Rangoli Contest: సంక్రాంతి వచ్చిందంటే చాలు... చుక్కుల ముగ్గులు వేసి సంబర పడిపోతుంటారు ఆడాళ్లు. మిగతా వాళ్లకంటే మన ముగ్గు చూడటానికి బాగుండాలని తపన పడిపోతుంటారు. అలాగే ఈసారి మరికాస్త శ్రద్ధ పెట్టారనుకోండి ఏకంగా 25 లక్షలు మీవే. ముగ్గుల కోసం ఇంత పెద్ద ప్రైజ్ మనీ ఇస్తారా అనుకుంటున్నారా..? ఇది నిజంగా నిజం. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ AAA ఈ సంక్రాంతికి ఇంత అద్భుతృమైన అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం మీరు ఎక్కడికి వెళ్లనక్కర్లేదు. మీ ఇంటి నుంచే పాల్గొనొచ్చు
ప్రపంచస్థాయి ముగ్గుల పోటీ
యుఎస్‌లో ఏపీ సాంస్కృతిక వికాసానికి కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ తొలిసారిగా ప్రపంచ స్థాయి ముగ్గులు పోటీలను నిర్వహిస్తోంది. ప్రపంచంలోని ఎక్కడివారైనా వయసుతో నిమిత్తం లేకుండా ఈ పోటీల్లో పాల్గొనొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. https://nationalconvention1.theaaa.org/reg/rangolicontest.html పేజిపై రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నియమ నిబంధనలన్నీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. పోటీలో పాల్గొనదలచిన వారు తమ ఇంటి ముందు లేదా ఎక్కడైనా సరే అందమైన రంగవల్లులను దిద్ది వీడియో తీసి అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ మీ ముగ్గు జడ్జిలను మెప్పించిందనుకోండి.. పాతిక లక్షలూ మీవే. ప్రపంచ స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఇదే మొదటి సారి. ఈ స్థాయిలో ప్రైజ్‌మనీ కేటాయించడం కూడా ఫస్ట్ టైమ్. మొదటి ప్రైజ్ 25,00116, రెండో ప్రైజ్ 1500116, మూడో ప్రైజ్ 10,00116, నాలుగో ప్రైజ్ 5,00,116 ఐదో ప్రైజ్ గా 2,00,116 అందించనున్నారు. ఇవి కాకుండా 100మందికి 10వేల చోప్పున ప్రైజ్‌మనీ ఇస్తున్నారు.
ఇప్పటికే ప్రారంభమైన రిజిస్ట్రేషన్‌లకు మంచి స్పందన వస్తోందని AAA రీజనల్ కోఆర్డినేటర్ కటారి అజయ్ తెలిపారు. చాలా దేశాల నుంచి రిజిస్ట్రేషన్లు వస్తున్నాయన్నారు. ‘సంక్రాంతి అంటేనే ఏపీలో పెద్ద పండుగ. తెలుగు వారు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్లు సంక్రాంతిని రంగవల్లులతో వైభవంగా జరుపుకుంటారు. దానిని మరింతగా సెలబ్రేట్ చేసేలా యుఎస్‌లో ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని’ అజయ్ చెప్పారు. రిజిస్ట్రేషన్లు అయిపోయాక డిసెంబర్ 1 నుంచి జనవరి 15 వరకూ ముగ్గుల వీడియోలు పంపించవచ్చు. లావణ్య మోటుపల్లి ముగ్గుల పోటీ జ్యూరీ హెడ్‌గా ఉంటారు. ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ప్రియ ఆచంట, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ సత్యనారాయణ, న్యాయమూర్తి సురేష్ న్యాయనిర్ణేతలుగా ఉంటారు.
అమెరికాలో తెలుగు సాంస్కృతిక వైభవానికి కృషిచేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను AAA నిర్వహిస్తోంది. అమెరికాలో తెలుగు అసోసియేషన్లు చాలా ఉన్నాయి. అయితే ఇది ప్రత్యకంగా ఆంధ్రప్రదేశ్ అంశాలపై ఫోకస్ చేస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త హరి మోటుపల్లి స్థాపించారు. ప్రస్తుతం బాలాజీ వీర్నాల నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.