CM Revanth Reddy Comments In Vemulawada Meeting: మాజీ సీఎం కేసీఆర్.. ప్రజలనే కాదు వేములవాడ రాజన్ననూ మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మండిపడ్డారు. ఆయన పదేళ్లలో చేయలేని పనులు తాము 10 నెలల్లో చేసి చూపించామని అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వేములవాడ (Vemulawada) గుడిచెరువులో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. 'కేసీఆర్‌ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలోనే నిర్ణయించుకున్నా. ఇందిరమ్మ రాజ్యంలో వేములవాడను అభివృద్ధి చేసుకుంటున్నాం. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం. ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల 30న మరోసారి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇక్కడకు వచ్చి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులపై సమీక్ష చేస్తారు.' అని పేర్కొన్నారు.


'దేశానికి దశ - దిశ సూచించిన నేత పీవీ పుట్టిన గడ్డ కరీంనగర్ అని రేవంత్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఈ కరీంనగర్ గడ్డపై నుంచే సోనియమ్మ మాట ఇచ్చి దాన్ని నిజం చేశారు. కరీంనగర్‌లో బీజేపీని గెలిపిస్తే జిల్లాకు ఏం ఒరిగింది?. కరీంనగర్ అభివృద్ధి కోసం పార్లమెంట్‌లో ప్రశ్నించారా? జిల్లా అభివృద్ధికి చిల్లి గవ్వ తెచ్చారా?. అలా చేసి ఉంటే జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలేవా.?. పదేళ్లలో రూ.20 లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్.. రూ.100 కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి ఎందుకు చేయలేదు?. మీ నొప్పికి మా కార్యకర్తలకు మందు ఎక్కడ పెట్టాలో తెలుసు. రుణమాఫీపై దుష్ప్రచారం చేసున్న మీకు.. ధైర్యం ఉంటే నిజాన్ని ఎదుర్కొనే సత్తా ఉంటే అసెంబ్లీకి రావాలి. మా వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెబుతారు.' అని సీఎం సవాల్ విసిరారు.


'50 వేల ఉద్యోగాలు లెక్క కట్టి చూపిస్తా'


పది నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని వీటిని లెక్క కట్టి చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పారు. ఇందులో ఒక్క తల తగ్గినా ఎల్బీ స్టేడియం వేదికగా నేను క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. 'మీ పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో... మా పది నెలల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో చర్చకు పెడదాంరా. ఆనాడు వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన చరిత్ర కేసీఆర్‌ది. పదేళ్లలో కేసీఆర్ ప్రాజెక్టుల కోసం రూ.1.23 లక్షల కోట్లు ఖర్చు చేశారు. రూ.11 వేల కోట్ల రుణమాఫీకి కేసీఆర్ ఐదేళ్లు తీసుకున్నారు. 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశాం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు తీసి చూపిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంగతి తేలుస్తాం.' అని అన్నారు.


'కేసీఆర్ ఒక్కసారి అసెంబ్లీకి రా'


రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని భూ సేకరణ చేస్తున్నట్లు చెప్పారు. 'కొడంగల్‌లో భూసేకరణ చేస్తే మీకు కడుపుమంట దేనికి?. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూములు కోల్పోయి బాధలో ఉన్న వారిని మా ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుంది. పరిహారం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూమి కోల్పోతున్న వారికి 3 రెట్లు పరిహారం ఇవ్వాలని నిర్ణయించాం. చివరగా కేసీఆర్‌కు ఒక్క మాట చెబుతున్నా. అసెంబ్లీకి రా సామి.. ఒక్కసారి రా. వస్తే రోజంతా చర్చ చేద్దాం. అన్ని లెక్కలు తేలుద్దాం.' అని సీఎం అన్నారు.


Also Read: Warangal BRS leaders: వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు