Warangal Latest News Today: ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వరంగల్‌లో బీఆర్ఎస్ నేతలు. అబద్ధాలు, మోసాలు, తప్పుడు ప్రమాణాలతో అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. హనుమకొండలోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దయాకర్ రావుతోపాటు బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం అనే విషయాన్ని మరిచిపోయి రేవంత్ రెడ్డి చిల్లరగా, చీటర్‌గా మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు.


తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని దయాకర్ రావు ‌ప్రశ్నించారు. ఉద్యమం టైంలో టిడిపి ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తే... రేవంత్‌రెడ్డి తప్పించుకొని తిరిగారని ఆరోపించారు. రేవంత్ మినహా తామంతా టీడీపీలోనే ఉంటూ తెలంగాణ కోసం చంద్రబాబుపై పోరాటం చేశామని గుర్తు చేశారు. కాళోజీ నారాయణరావు గురించి గొప్పలు చెప్పే రేవంత్ రెడ్డి ఏ రోజైనా కలిశారా, పరిచయం చేసుకున్నారా అని నిలదీశారు. ఉద్యమం కోసం అనేకసార్లు కాళోజీని కేసీఆర్ కలిశారని అన్నారు. తెలంగాణకు అన్యాయం చేసే బాబ్లీ ప్రాజెక్టుపై టిడిపి ఎమ్మెల్యేలు అప్పట్లో పోరాడితే రేవంత్ రెడ్డి తప్పించుకుని వచ్చారని గుర్తు చేశారు.


ఎర్రబెల్లి దయాకర్ రావు రాక్షసుడే...
ఎర్రబెల్లి దయాకర్ రావు రాక్షసుడు అంటూ రేవంత్ మాట్లాడారని,ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం పోరాడే రాక్షసుడని కౌంటర్ ఇచ్చారు. ప్రజల కోసం దేనికైనా తెగిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ తర్వాత వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి దయాకర్ అని అన్నారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచి తరిమిస్తే రంగారెడ్డి జిల్లాలో పోటీ చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 


రేవంత్ రెడ్డి కుటుంబమే కోటిశ్వర్లు
సంవత్సర కాలంలో మహిళల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని దయాకర్ రావు డిమాండ్ చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయడం పక్కన పెడితే రేవంత్ బంధువులు కోటీశ్వరులు అవుతున్నారని ఆరోపించారు. వరంగల్‌ డిక్లరేషన్‌లో ఏమి అమలు చేశారో చెప్పాలన్నారు. మహిళలకు 2500 నగదు, తులం బంగారం ఏమైందని అన్నారు. రేవంత్ రెడ్డి ఒక గంజాయి మొక్క అని దాన్ని పీకేయడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారని కామెంట్ చేశారు. 
ప్రజా విజయోత్సవ సభకు ఎంతమంది మంత్రులు వచ్చారు అని దయాకర్ రావు గుర్తు చేశారు. సభకు మంత్రులతోపాటు స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి రాలేదని అన్నారు. కాంగ్రెస్ నేతలను రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఒక ల్యాండ్ మాఫియా అని మండిపడ్డారు. సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్‌ ఇప్పుడు అమ్మ అంటున్నారని విమర్శించారు.



ఏడాదిలో 85 వేల కోట్ల అప్పు


కాంగ్రెస్ సభ ఒక వంచన సభ అని మాజీ స్పీకర్ మధుసూదనా చారి మండిపడ్డారు. నాలుగు లక్షల 25 వేల కోట్లు అప్పుచేసిన కేసీఆర్ వనరులు సృష్టించారని అన్నారు. రేవంత్ రెడ్డి 11 నెలల కాలంలో 85 వేల కోట్లు అప్పు చేశారని ఇలా అప్పు చేసి ఏ పథకాన్ని అమలు చేయకుండా చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. రేవంత్ రెడ్డి పదవి తుమ్ముతే ఊడిపోయే ముక్కు లాంటిందన్నారు. వరంగల్ సభతో రేవంత్ రెడ్డికి కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు. 


మహిళలే తిరగబడతారు 


రేవంత్ రెడ్డి అన్నట్టు కొడంగల్‌లో కాంగ్రెస్ నేతలను రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను అధికారులను ప్రజలు తొక్కుతున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తున్నారని రాణి రుద్రమ, సమ్మక్క సారలమ్మ పౌరుషంతో మహిళలు తిరగబడతారని చెప్పారు. అల్లుడు కోసం ఫార్మసిటి, అన్నదమ్ముల కోసం ఫోర్త్ సిటీ కట్టబెట్టారని రెడ్డి ఆరోపించారు. అదానితో కుమ్మక్కై వియ్యంకునికి ప్రాజెక్టులు కట్టబెడుతున్నారాన్నారు. 


Also Read: రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !