TTD Special Services For Senior Citizens: 65 ఏళ్లు దాటిన వృద్ధులకు టీటీడీ (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. వయసు రీత్యా శ్రీవారి దర్శనానికి వచ్చే వారికి ప్రత్యేక వెసులుబాట్లు కల్పించనుంది. సీనియర్ సిటిజన్లకు స్వామి వారి ఉచిత దర్శనం కోసం రెండు స్లాట్లు కేటాయించారు. ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు రెండు స్లాట్లు కేటాయించారు. వీరు ఫోటో ఐడీతో పాటు వయస్సును నిర్ధారించే రుజువును సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని S1 కౌంటర్‌కు నివేదించాల్సి ఉంటుంది. వీరు వంతెన దిగువన ఉన్న గ్యాలరీ నుంచి ఆలయం కుడి గోడ వద్ద రహదారిని దాటాలి. ఏ మెట్లు సైతం ఎక్కాల్సిన పని లేదు. అక్కడ దర్శనం కోసం వేచి చూసే సౌకర్యాలు కల్పిస్తారు.


వృద్ధులకు అనుగుణంగా ఉత్తమ సీట్లు, వేడిగా సాంబార్ అన్నం, పెరుగన్న, వేడి పాలు ఇవన్నీ వారి సీట్ల దగ్గరికే తెచ్చి సిబ్బంది అందిస్తారు. దర్శనం అనంతరం ఆలయం నిష్క్రమణ ద్వారం వద్ద కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి, కౌంటర్ వద్ద వీరిని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంది. ఎలాంటి ఒత్తిడి, బలవంతం లేకుండా ప్రశాంతంగా స్వామి దర్శనం చేసేలా వృద్ధుల కోసం టీటీడీ చర్యలు చేపట్టింది. దర్శన క్యూ తర్వాత వీరు 30 నిమిషాల్లోపే దర్శనం నుంచి నిష్క్రమించవచ్చు. పూర్తి వివరాలకు హెల్ప్ లైన్ నెం. 08772277777ను సంప్రదించాలని అధికారులు సూచించారు.


గురువారం టికెట్లు విడుదల


మరోవైపు, తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ గురువారం విడుదల చేయనుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఇక, శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ టికెట్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. అలాగే, ఈ నెల 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.


ఇకపై వారికి నో ఎంట్రీ


అటు, తిరుమలలో అన్యమత ప్రచారంపై టీటీడీ ఫోకస్ చేసింది. ప్రసిద్ధ హిందూ ధార్మిక క్షేత్రంలో తరచూ అన్యమత ప్రచారం వివాదంగా మారుతోంది. నిబంధనల ఉల్లంఘనపై తితిదే ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 రోజుల క్రితం అటవీ శాఖ పరిధిలోని పాపనాశనం వద్ద కొందరు మహిళలు క్రైస్తవ గీతాలు పాడుతూ రీల్స్ చేయడం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం స్పందించింది. తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు రీల్స్ చేసిన మహిళల ఆచూకీ తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. విజిలెన్స్, పోలీసులు, అటవీ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సమీప దుకాణాల్లో దాదాపు 25 మందికిపైనే అన్యమతస్తులు పని చేస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో ప్రతీ దుకాణాన్ని పరిశీలించి ఇతర మతాలకు చెందిన వారి ఆధారాలు కనిపెట్టేందుకు చర్యలు చేపట్టారు.


Also Read: Andhra Pradesh Volunteer System: వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన