Nara Lokesh Comments in Yuvagalam at Podalada: రాష్ట్రంలో మంత్రులకు కౌంట్ డౌన్ మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదు కనుకే మళ్లీ ఇక్కడ నిలబడ్డానని పేర్కొన్నారు. 'టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపితే నా పాదయాత్ర ఆగుతుంది అనుకున్నారు. వైసీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదు. వ్యవస్థలను మేనేజ్ చేసి 53 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టారు. నాపై కూడా సీఐడీ కేసులు పెట్టారు. ఇప్పటి వరకూ 6 కేసులు పెట్టినా ఒక్క ఆధారం లేదు. స్కిల్ కేసులోనూ ఒక్క ఆధారం చూపలేకపోయారు. ఆనాడు పవన్ కల్యాణ్ వస్తుంటే ఎలా అడ్డుకున్నారో చూశాం. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా.' అని లోకేశ్ వ్యాఖ్యానించారు. స్కిల్ కేసులో తమ పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా.? అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వైసీపీ నేతలు అన్న క్యాంటీన్లపైనా కేసులు పెడతారని, ఏం చేసినా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు.


సుదీర్ఘ విరామం అనంతరం


దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ విరామం అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) 'యువగళం' (Yuvagalam) పాదయాత్ర సోమవారం నుంచి పునఃప్రారంభమైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడగా, దాదాపు 79 రోజుల విరామం అనంతరం ఎక్కడ ఆపేశారో అక్కడి నుంచే లోకేశ్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఉదయం 10:19 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు (Rajolu) మండలం పొదలాడ (Podalada) నుంచి 'యువగళం' ప్రారంభించారు. ఈ క్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. పాదయాత్రలో భాగంగా పి.గన్నవరం పరిధిలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు.


సెప్టెంబరు 8న ప.గో జిల్లా నుంచి ఉమ్మడి తూ.గో జిల్లాలోకి ప్రవేశించిన లోకేశ్ యాత్ర రాజోలు మీదుగా పొదలాడ చేరుకుంది. ఆ మరుసటి రోజు చంద్రబాబు అరెస్టు కావడంతో లోకేశ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. చంద్రబాబుకు ఇటీవల బెయిల్‌ మంజూరు కావడంతో యాత్రను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ఈసారి షెడ్యూల్ మార్పు చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రోజుకు 15 కి.మీ. నుంచి 20 కి.మీ. మేర పాదయాత్ర, మధ్యలో బహిరంగ సభలు, స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తూ లోకేశ్ ముందుకు సాగనున్నారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


Also Read: PM Narendra Modi Visits Tirumala: తిరుమలేశుడిని దర్శించుకున్న ప్రధానమంత్రి