Chandrababu Teleconference With TDP Activists to Support Michaung Cyclone Victims: మిగ్ జాం తుపాను పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. తుపాను పరిస్థితిపై టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో ఆయన ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాసం తీరు, బాధితులకు ఆహారం కూడా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగానే హెచ్చరికలు వచ్చినా, తగు చర్యలు చేపట్టలేదని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తుపాను ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకూడదని, పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని రైతులకు తగిన పరిహారం అందించాలన్నారు. తుపాను బాధితులకు భోజనం కూడా సరిగ్గా పెట్టలేరా.? అని ప్రశ్నించారు. హుద్ హుద్, తిత్లీ వంటి తుపానుల సమయంలో టీడీపీ హయాంలో ఎలా బాధితులకు సహాయం అందించామో గుర్తు చేశారు. ప్రత్యేక జీవోల ద్వారా బాధితులకు, రైతులకు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.


సాయం చేయాలని శ్రేణులకు ఆదేశం


మిగ్ జాం తుపాను తీవ్రతపై పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ఆహారం, తాగునీరు అందించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చూడాలని నిర్దేశించారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల బాధితులకు సకాలంలో సహాయం అందడం లేదని, పూర్తి స్థాయిలో వారికి సహాయం అందేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు. పంట నష్టం వివరాలను అధికారుల దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. ఎప్పటికప్పుడు బాధితుల సహాయక చర్యలు పర్యవేక్షించాలని పేర్కొన్నారు.


తీరం దాటిన తుపాను


మిగ్ జాం తుపాను బాపట్ల వద్ద తీరం దాటింది. ఈ క్రమంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. కొన్ని గంటల్లో తీవ్ర తుపాను బలహీనపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం వాయుగుండంగా బలహీనపడుతుందని చెప్పారు. తుపాను తీరం దాటినా ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని సూచించారు. తుపాను తీరం దాటిన సమయంలో బాపట్ల తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి. తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. 11 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. పలు చోట్ల ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధిత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 


Also Read: TTD Chairman Bhumana: తిరుమలలో అన్నప్రసాదంపై ఆ వీడియోలు బాధాకరం, బాధ్యులపై చర్యలు: టీటీడీ చైర్మన్ భూమన