Vengamamba Annaprasadam: తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్ధానం (TTD) మరో వివాదంలో చిక్కుకుంది. టీటీడీ వెంగమాంబ అన్నదాన సత్రంలో నాసిరకం బియ్యంతో చేసిన ప్రసాదాలు పెట్టారని భక్తులు నిరసనకు దిగారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. అన్నప్రసాద సముదాయంలో భక్తులకు వడ్డించే అన్నం ఉడకలేదంటూ కొందరు భక్తులు ఆరోపించారు. టీటీడీ సిబ్బందిపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. వైరల్ గా మారిన వీడియోపై టీటీడీ స్పందించి, విచారణ చేపట్టి వివరణ ఇచ్చింది.
తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులు మహాప్రసాదంగా భావించి మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం స్వీకరిస్తుంటారు. వెంగమాంబ అన్నదాన సత్రంలో మొత్తం నాలుగు హాల్స్ ఉండగా, ఒక దఫాలో దాదాపు 4 వేల మంది భోజనం (మహా ప్రసాదం) స్వీకరించే అవకాశం ఉంది. ఇలా ఒక్క రోజుకి మొత్తం నలభై వేలనుండి యాభై వేలమందికిపైగా భక్తులు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తుంటారు. గత కొంత కాలంగా అన్నదానంపై అనేక విమర్శలు వస్తున్నాయి. గతంలో నాణ్యత లేని బియ్యంతో భక్తులకు అన్నం తయారు చేసి వడ్డిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. గత వారం కార్తీక దీపం రోజు అన్నదానంలో భుజించిన భక్తులు అన్నం సరిగ్గా లేదంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.
తాజాగా సోమవారం సాయంత్రం ఏపీకి చెందిన దాదాపు 17 మంది భక్తబృందం అన్నదాన సత్రం మహాప్రసాదం స్వీకరించేందుకు వెళ్ళిన సమయంలో అన్నం సరిగ్గా ఉడకకుండానే భక్తులకు వడ్డించేస్తారా అంటూ భక్తులు నిరసన తెలిపారు. అక్కడే ఉన్న టీటీడీ సిబ్బందిని చొక్కా పట్టుకుని నిలదీసి టీటీడీ ఉన్నతాధికారులు వచ్చి వెంటనే సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఒక్కసారికి వదిలేయమంటూ పొరపాటు జరిగిందని వదిలేయమంటూ భక్తులను సిబ్బంది వేడుకున్నారు. ఈ ఘనటకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ రాజకీయ పార్టీ ఈ వీడియోను పోస్టు చేసింది. ఇప్పటికే ఈ ఘటనపై టీటీడీ డిప్యూటీ ఈవో రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఇందుకు గల కారణాలపై పూర్తి స్ధాయిలో విచారణ జరుపుతున్నామని చెప్పారు.
భక్తుల నిరసన వీడియోపై టీటీడీ ఛైర్మన్ ఏం చెప్పారంటే...
మహాప్రసాదం (భోజనం) సరిగాలేదని వీడియో వైరల్ కావడంపై టీటీడీ స్పందించింది. ఇది కేవలం రాజకీయ కోణంలో కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ కొట్టి పడేసింది. అన్నప్రసాదంలో నాణ్యత లోపంపై టీటీడీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. కొందరు భక్తులు అన్నప్రసాదం బాగాలేదని చెప్పడం తమ దృష్టికి వచ్చిందని, బియ్యంలో నాణ్యత లోపంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అన్నప్రసాదం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇలాంటిది జరగలేదన్నారు. అదే సమయంలో మరో 700 మంది భక్తులు అన్నప్రసాదాని స్వీకరించారని, ఆ భక్తులకు లేని ఇబ్బంది మిగిలిన భక్తులకు ఎందుకు కలిగిందో అర్ధం కావడం లేదన్నారు. ఇతర భక్తులను కొంత మంది రెచ్చగొట్టడం, అక్కడ పని చేసే సిబ్బంది తాగుబోతులని ఆరోపించడం బాధాకరం అన్నారు. రాజకీయ కోణంలో అన్నదాన సత్రంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని భూమన చెప్పారు.