Chandrababu Political Tour in Districts: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఈ నెల 10 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన ఆయనకు గత నెల హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కంటికి శస్త్ర చికిత్స అనంతరం వారం రోజులు విశ్రాంతి తీసుకోగా, శుక్రవారం సతీమణి భువనేశ్వరితో (Bhuvaneswari) కలిసి తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అమరావతి చేరుకుని టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. శనివారం విజయవాడ దుర్గమ్మను సతీసమేతంగా దర్శించుకుంటారు. వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 3న (ఆదివారం) సింహాచలం అప్పన్న స్వామిని, 5న శ్రీశైలం మల్లన్న, అనంతరం కడప దర్గా, గుణదల మేరీమాత ఆలయానికి ఆయన వెళ్లనున్నారు. 


10 నుంచి పర్యటనలు


దేవాలయాల సందర్శన అనంతరం చంద్రబాబు పూర్తి స్థాయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఈ నెల 10 నుంచి ఆయన జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను జగన్ (CM Jagan) ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిందని టీడీపీ (TDP) ఆరోపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో ఏపీ పంచాయతీ రాజ్ చాంబర్, ఏపీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ నెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప జిల్లాల్లో జరిగే సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశాలకు పార్టీలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఆహ్వానించనున్నారు. ఒక్కో సమావేశానికి సుమారు 5 నుంచి 6 వేల మంది వరకూ హాజరవుతారని అంచనా వేస్తున్నారు.


త్వరలో ఢిల్లీకి.?


మరోవైపు, రాష్ట్రంలో ఓట్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయించారు. సీఎం జగన్, వైసీపీ నేతలు ఓటమి భయంతో దొంగ ఓట్లు చేరుస్తున్నారని, టీడీపీ సానుభాతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ నెల 6 నుంచి 8 లోపు తనకు సమయం కేటాయించాలని సీఈసీకి ఆయన లేఖ రాయనున్నారు. 


తొలిసారి ఎంపీలతో సమావేశం


చాలా కాలం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం తొలిసారిగా ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ నెల 4 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఆయన చర్చించారు. ప్రతిపక్షాలే టార్గెట్‌గా ఏపీలో పాలన తీరును పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాలన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలకు లెక్క లేకుండా పోతుందని అన్నారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీకి అంతే లేకుండా పోయిందని, ఈ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలకు నిర్ధేశించారు.


Also Read: AP Letter to KRMB: 'నీటి విడుదలను ఆపేది లేదు' - కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం స్పష్టత, కేంద్రం ఆధీనంలోకి సాగర్ ప్రాజెక్టు