CM Jagan Released YSR Kalyana Masthu Funds: వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులను సీఎం జగన్ (CM Jagan)తన క్యాంపు కార్యాలయంలో గురువారం బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ ఏడాది జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు రూ.81.64 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ.75 వేలు అందజేశారు. అలాగే, మైనార్టీ, దూదేకుల, నూర్ భాషా కులస్థులకు రూ.లక్ష, భవన, ఇతర నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.40 వేల చొప్పున నగదు విడుదల చేశారు. పేద వర్గాలను ఆదుకునేందుకు, వారికి చేయూతనిచ్చేందుకు ఈ సాయం అందిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. సాయం పొందిన జంటల్లో 8,042 మంది అమ్మఒడి లేదా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద కూడా ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
3 విడతల్లో ఆర్థిక సాయం
ఈ పథకం కింద ఇప్పటివరకూ 3 త్రైమాసికాల్లో 3 విడతల్లో ఆర్థిక సాయం అందించినట్లు సీఎం జగన్ తెలిపారు. 2022, అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ నాలుగు విడతతో కలిపి 46,062 జంటలకు రూ.349 కోట్లు వధువుల తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పేదవాళ్లకు మంచి జరగాలనే చిత్తశుద్ధి లేదని, ఆ దిశగా అడుగులే పడలేదని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడేలా ఒక్క పథకమూ తీసుకురాలేదని మండిపడ్డారు. ఈ సాయం ద్వారా తల్లిదండ్రులు పిల్లల్ని చదివించేలా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.
'అందుకే ఆ నిబంధన'
ఈ పథకం ప్రకటించేటప్పుడు చాలా మంది 18 ఏళ్ల నిబంధన చాలని, అందరికీ ఇస్తే ఎక్కువ ఓట్లు వస్తాయని తనతో చెప్పారని సీఎం జగన్ అన్నారు. అయితే, ఓట్లు, ఎన్నికలు సెకండరీ అని, విజన్ మాత్రమే ముఖ్యమని తాను ఆలోచించినట్లు చెప్పారు. 'టెన్త్ సర్టిఫికెట్, వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు ఉండాలనే నిబంధన పెట్టాం. దీంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గేలా అడుగులు వేశాం. టెన్త్ తప్పనిసరి చేయడం వల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేందుకు మరింత ఊతం ఇస్తుంది.' అని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని, ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చాయని గుర్తు చేశారు. 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, ఐఎఫ్‌పీల బోధన, 3వ తరగతి నుంచి సబ్జెట్ టీచర్, 8వ తరగతి వాళ్లకు ట్యాబ్స్, బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ తో పిల్లలు బాగా ఎదగాలని అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.
'గ్రాడ్యుయేట్ వరకూ మోటివేషన్'
అమ్మఒడి పథకం వల్ల తమ పిల్లలను బడికి పంపేలా తల్లులు మోటివేట్ అవుతున్నారని సీఎం జగన్ తెలిపారు. వైఎస్ఆర్ కల్యాణ మస్తు నిబంధనల వల్ల ఇంటర్ వరకూ తమ పిల్లలను చదివిస్తారని, ఆ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల వల్ల పిల్లలను గ్రాడ్యుయేట్ వరకూ చదివించేందుకు వెనుకాడరని పేర్కొన్నారు. దీని వల్ల చదువు అనే అస్త్రంతో పిల్లల తలరాతలు మార్చే గొప్ప వ్యవస్థ ఏర్పాటైందని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈ పథకం తెచ్చినట్లు స్పష్టం చేశారు.