CM Jagan Tirupati Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 5వ తేదీన తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి కలెక్టరేట్ లో జిల్లా మంత్రులు, అధికారులతో తిరుపతి జిల్లా‌ కలెక్టర్ వెంకటరమణారెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో సీఎం పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోనేటి ఆదిమూలం, ఎంపీ గురుమూర్తి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హాజరుఅయ్యారు. 


సీఎం తిరుపతి పర్యటన ఖరారు 


ఈ సమీక్షా సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 5వ తారీఖున సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన ఖరారు అయ్యిందన్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశం ఏర్పాటుచేశామన్నారు. తిరుపతిలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సీఎం హాజరు కానున్నారని, అందులో ముఖ్యంగా జగన్న విద్యా దీవెన ప్రారంభోత్సవ కార్యక్రమం, బహిరంగ సభను ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో అలిపిరి సమీపంలోని చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంకుస్థాపన, టాటా క్యాన్సర్ ఆసుపత్రికి సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగనున్నట్లు తెలిపారు. 


సీఎం కాన్వాయ్ కు ఎటువంటి సమస్య లేదు


పర్యటనకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అనే విషయమే మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారుల సలహాలు, సూచనలు తీసుకున్నామని, వాటిని పరిగణలోకి తీసుకుని సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు. మరో రెండు రోజుల్లో సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి చేస్తామని, అలాగే సీఎం కాన్వాయ్ సమకూర్చడంలో ఎటువంటి సమస్యలు లేవని, కాన్వాయ్ సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలు ప్రభుత్వం పూర్తిగా చెల్లిస్తోందని జిల్లా కలెక్టర్ వెంకటరమణ తెలిపారు. అనంతరం తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. సీఎం పర్యటనను విజయవంతం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని, లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు సమకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 


శ్రీనివాస సేతు మొదటి దశ ప్రారంభం 


శ్రీనివాస సేతు (గరుడ వారధి) మొదటి దశను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మే 5న తిరుపతిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అలాగే రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులు సమకూరుస్తోంది. జగన్ తన పర్యటనలో రూ. 240 కోట్లతో శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో టాటా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించి, ఆరోగ్యశ్రీ పోర్టల్‌ను ప్రారంభిస్తారు. బిఐఆర్‌ఆర్‌డి హాస్పిటల్‌లో పెదవులు చీలిపోయిన వ్యక్తులకు చికిత్స చేయడానికి మొట్టమొదటిసారిగా రూపొందించిన క్లినిక్ అయిన ‘స్మైల్ ట్రైన్ సెంటర్’ని కూడా ఆయన ప్రారంభిస్తారు.