JC Prabhakar Reddy : తాడిపత్రి మున్సిపాల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన బస్ యాత్రపై స్పందించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అనంతపురం జిల్లా వ్యాప్తంగా బస్ యాత్ర చేస్తానని ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇన్ని రోజులకు కార్యకర్తలకు స్వేచ్ఛ ఇచ్చారన్నారు. చంద్రబాబు ఫొటోతో వచ్చే నెలలో జిల్లా అంతా తిరుగుతానన్నారు. సీఎం జగన్ నంద్యాల సభలో వెంట్రుక పీకలేరు అన్నది ఆ పార్టీ ఎమ్మెల్యేలనే అన్నారు. తాను చెప్పిన వారే మంత్రులు మిగతావారు తన వెంట్రుక పీకలేరని అర్థం వచ్చేలా మాట్లాడారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుందని ప్రశ్నించారు. సుబ్బారెడ్డి ఏమిచేస్తున్నారన్నారు. రెండేళ్ల అనంతరం దేవుడిని చూద్దామని వస్తే ఇన్ని అవస్థలా అని ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డి వచ్చాక దైవ దర్శనం కరువైందన్నారు. అనంతపురం జిల్లాకు పవన్ కల్యాణ్ వస్తే కానీ ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వరా అని వైసీపీ ప్రభుత్వాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రికి రావాలని పవన్ కల్యాణ్ ని ఆహ్వానిస్తానన్నారు. 



బాధిత కుటుంబాన్ని మంత్రి ఆదుకోవాలి 


కల్యాణదుర్గం పట్టణంలో శుక్రవారం అనారోగ్యంతో హాస్పిటల్ కి వెళ్తోన్న ఒక చిన్నారి మంత్రి ఉషా శ్రీ చరణ్ ర్యాలీలో చిక్కుకుని ప్రాణాలు విడిచిందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ అధినేత సూచన మేరకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఉమామహేశ్వర నాయుడు చిన్నారి కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. వారి కుటుంబానికి జేసీ ప్రభాకర్ రెడ్డి 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జేసీ మాట్లాడుతూ మంత్రి ఉషా శ్రీ చరణ్ బాధితుల కుటుంబానికి అండగా ఉండాలని కోరారు. ఆ చిన్నారి తండ్రి అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నారని అతనికి ఫించన్ వచ్చేలా చేయాలని కోరారు. 


ఆలూరులో ఉద్రిక్తత 


తాడిపత్రి మండలం ఆలూరు గ్రామ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలూరు కోన శ్రీ రంగనాథ స్వామి రథోత్సవానికి వెళ్తున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు జేసీకి మధ్య కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ, తాము కూడా స్వామి వారి రథోత్సవానికే వచ్చామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లోపల స్థానిక ఎమ్మెల్యే రథోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం అదే సమయంలో జె.సి ప్రభాకర్ రెడ్డి అక్కడికి వెళ్లడం ప్రజలు భయాందోళన గురయ్యారు. ఎంతసేపు అయినా రథోత్సవాన్నీ తిలకించి దర్శనం చేసుకొనే వెళానని భీష్మించడంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపి జేసీ ప్రభాకర్ రెడ్డిని రథోత్సవానికి అనుమతించారు పోలీసులు.