Anantapur Police: అనంతపురం జిల్లా పోలీస్ శాఖలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎంతమంది మారినా కూడా పాత ఐపీఎస్ అధికారి పేరు మాత్రం ఓ పోలీస్ స్టేషన్లో నేమ్ బోర్డుపై అలాగే దర్శనం ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికీ ఎన్నికల సమయం నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదు మంది పోలీస్ బాస్ లు మారారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు అన్బురాజన్ జిల్లా పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం బద్దర్ ఐపిఎస్ విధులు నిర్వహించారు. తాడిపత్రి అల్లర్ల ఘటన నేపథ్యంలో బద్దర్ ఐపీఎస్ ను ఎన్నికల సంఘం ట్రాన్స్‌ఫర్ చేసి.. జిల్లాకు గౌతమిశాలి ఐపీఎస్ ను జిల్లా పోలీస్ అధికారిగా నియమించింది. 


ఎన్నికల కౌంటింగ్ అనంతరం నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మురళీకృష్ణ అనంతపురం జిల్లాకు వచ్చారు. మురళీకృష్ణ జిల్లా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే విజయవాడలో డీజీపీకి రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాలు రావడంతో ప్రస్తుతం జిల్లా పోలీస్ అధికారిగా జగదీష్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ జగదీష్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేస్తూ తిరుగుతున్న సమయంలో గార్లదిన్నె మండలం పోలీస్ స్టేషన్ ను ఈరోజు తనిఖీ చేశారు. ఈ పోలీస్ స్టేషన్లోనే అధికారుల నేమ్ బోర్డుపై పాత ఐపీఎస్ అధికారి కేకే అన్బురాజన్ ఐపీఎస్ అని పేరు దర్శనమిచ్చింది. ఇప్పటికి 5 మంది జిల్లా ఎస్పీలుగా మారినప్పటికీ గార్లదిన్నె పోలీస్ స్టేషన్ నేమ్ రోడ్డుపై మార్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. 




జిల్లా ఎస్పీ వి జగదీష్ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో మీడియాకు విడుదల చేసిన ఫొటోస్ లో కూడా ఆ పేరు స్పష్టంగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.