Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో బెల్టు షాపులు నిర్వహించే ఓనర్లను సన్మానించారు. అయితే, వారు ఆ బెల్టు షాపులను మూసివేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం కారణంగానే ఎమ్మెల్యే వారిని సన్మానించారు. దీంతో బెల్టు షాపు నిర్వాహకులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభినందించారు. పల్లెల్లో సామాజిక రుగ్మతలు రూపుమాపేలా స్వచ్ఛదంగా ప్రజలు ముందుకు రావడం అభినందనీయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు.


బెల్టు షాపుల మూసివేతకు కసరత్తు


మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించడం కోసం ఎమ్మెల్యే రాజగోపాల్ కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బెల్టు షాపులు తీసేసిన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తానని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. గత బుధవారం మునుగోడులోని తన క్యాంపు ఆఫీస్‌లో రాజగోపాల్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాక, తన నియోజకవర్గంలో గంజాయిని కూడా కూకటివేళ్లతో పెకిలించాలని సూచించారు. 


ఎవరైనా గంజాయి అమ్మినా, సేవించినా కేసులు పెట్టి జైలుకు పంపాలని పోలీస్ అధికారులకు సూచించారు. గంజాయి నిర్మూలించడానికి పోలీసులు కూడా చాలా కఠినంగా పని చేయాలని కోరారు.