అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. కైలు రైతుల భరోసా యాత్రలో భాగంగా ఆయన ఇటీవల చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. మంగళవారం (ఏప్రిల్ 12) ఉదయం నుంచి ఆయన బాధిత కుటుంబాలను కలుస్తూ చెక్కులను అందజేస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కలుగురి రామకృష్ణ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ఆయన భార్య నాగలక్ష్మికి అందజేశారు. కుటుంబానికి పార్టీపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తన తండ్రి 12 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడని.. పంటనష్టం, చేసిన అప్పులు తీర్చలేక అన్నంలో పురుగుల మందు కలుపుకొని తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడని రామకృష్ణ కుమారుడు మహేష్ ఆవేదన చెందాడు. 


అనంతపురం జిల్లా ధర్మవరం నియోజవర్గం గొట్లూరులో ఇటీవల సాగునష్టం, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన మైనార్టీ వర్గానికి చెందిన కౌలు రైతు నిట్టూరు బాబు కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించి పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఆయన భార్య మల్లికకు అందజేశారు.


ధర్మవరం నియోజకవర్గ కేంద్రం శివనగర్ ప్రాంతంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించి పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఆయన భార్య చంద్రకళకు అందజేశారు. రాజశేఖర్ రెడ్డికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి విద్య బాధ్యతలను కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. 






కొత్త చెరువులో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించి పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయాన్ని ఆయన భార్య సాకే సుజాతకు అందజేశారు.