సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుమలలో భక్తులు పడుతున్న బాధలు వర్ణానాతీతం. పైన ఎండ కింద ఇసుకేస్తే రాలనంత జనం. పిల్లలు పెద్దవాళ్లు ముసలివాళ్లు అంతా దైవదర్శనం టోకెన్ల కోసం ఎగబడ్డారు. దీంతో తిరుమలలో కిక్కిరిసిపోయింది.
ఉదయం నుంచి భక్తులు పడుతున్న పాట్లు చూసిన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌లైన్‌లో విధానంలో సర్వ దర్శన టోకెన్ల
జారీ ప్రక్రియను నిలిపేసింది. కరోనాకు ముందు ఉన్న విధానాన్ని పునరుద్దరించింది.
టోకెన్లు లేకుండానే భక్తులను తిరుమలకు అనుమతించాలని నిర్ణయించింది. దీంతో రెండేళ్ల తరువాత వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలోకి భక్తులను అనుమతించనున్నారు. 2020 మార్చి 21వ తేది నుంచి భక్తులును కంపార్టుమెంట్లలోకి అనుమతించడం నిలిపివేసింది టిటిడి.
ఈ ప్రకటన చేస్తూ టీటీడీ ప్రకటన జారీ చేసింది. భక్తుల అధిక రద్దీ కారణంగా తిరుపతిలోని సర్వదర్శనం కౌంటర్లలో టోకెన్ల జారీ నిలిపివేస్తున్నామని టోకెన్ లేకుండా కూడా భక్తులను సర్వదర్శనానికి తిరుమలకు అనుమతించడం జరుగుతోందన్నారు. విపరీతమైన రద్దీ కారణంగా తిరుమలకు వెళ్లే భక్తులకు దర్శనం జాప్యం అయ్యే అవకాశం ఉందన్నారు. దీనికి సంసిద్దులై భక్తులు తిరుమలకు రావాల్సిందిగా రిక్వస్ట్ చేసింది టీటీడీ.
టీటీడీ ప్రణాళిక లోపం కారణంగా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. కరోనా తగ్గినప్పటి నుంచి క్రమంగా అన్ని దర్శనాల టికెట్లు పెంచుతూ వస్తున్న దేవస్థానం ఉచిత దర్శనాల టికెట్లపై మాత్రం దృష్టి పెట్టలేదు. రోజూ భక్తులు వస్తున్నప్పటికీ ఆ దిశగా ఆలోచన చేయలేకపోయింది. ఇదే ఇప్పటి ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
గత వారంలో హెచ్చరికగా ఓ రోజు భారీగా భక్తులు తరలి వచ్చారు. ఒకే రోజులు యాభైవేల మంది దర్శనానికి క్యూ కట్టారు. దాని ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకునే ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. కానీ అవేమీ పట్టించుకోలేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టీటీడీ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎలాంటి ప్రణాళిక లేకుండా ఒక్కసారిగా టోకెన్ సిస్టమ్ తీసేసి నేరుగా ఉచిత దర్శనాలకు అనుమతిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితిలో టీటీడీ ఉంది. అందుకే భక్తులను ఆ దిశగా మానసికంగా సిద్దం చేసింది. అంటే ఒకసారి ఇప్పుడు దర్శనానికి ఎంట్రీ లభిస్తే ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేరు. అన్ని దర్శనాలను క్యాన్సిల్ చేసి ఇప్పుడున్న భక్తులందర్నీ నేరుగా పంపించడం వల్ల ఎప్పటికీ ప్రక్రియ పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇలాంటి పరిస్థితి ఉన్నందునే తిరుమల వచ్చే భక్తులు ఆలోచించుకోవాలని టీటీడీ ప్రకటన జారీ చేసింది. స్వామి దర్శనం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉన్నందున దానికి తగ్గట్టు ప్రిపేర్డ్‌గా రావాలని రిక్వస్ట్ చేస్తోంది. ఒకసారి ఈ సర్వదర్శన క్యూలోకి ఎంట్రీ లభిస్తే మళ్లీ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. ఎన్ని గంటలైనా అక్కడే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. భక్తులు ఆ మేరకు రెడీ అవ్వాల అని టీటీడీ సూచిస్తోంది.