JC Prabhakar Reddy : టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌పై తీవ్రంగా మండిపడ్డారు.  నువ్వు కలెక్టర్‌గా పనికిరావంటూ కలెక్టర్ నాగలక్ష్మీపై విమర్శలు చేశారు. కలెక్టర్ ముందు పేపర్లు విసిరేశారు.  బీకేర్ ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.   సోమవారం అనంతపురం కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమంలో సమస్యపై ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్పందన ఎందుకు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ తననే బయటికి వెళ్లమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఒక ప్రజా ప్రతినిధి అయిన నన్నే బయటికి వెళ్లమంటారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మాజీ ఎమ్మెల్యే అయిన తన సమస్యనే పట్టించుకోకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. 


రూ.70 కోట్ల భూమి కబ్జా


తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామంలో రూ.70 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జాచేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై 2021 జనవరిలో కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు స్పందన లేదన్నారు. ఎమ్మెల్యే భూఅక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేస్తే ఒక్కరోజులో సమస్యను పరిష్కరించారని, తన ఫిర్యాదుపై ఎందుకు  స్పందించడంలేదన్నారు. ఈ భూ వ్యవహారంలో కలెక్టర్ కు  ఏమైనా సంబంధం ఉందా? అని నిలదీశారు. కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి పోతుంటే ప్రశ్నించకూడదా? అంటూ మండిపడ్డారు. 


వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తేనే స్పందింస్తారా? 


సమస్యలపై కలెక్టర్ స్పందించనప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో భూసమస్యపై ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించలేదని కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి నిలదీశారు.  వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదులపై ఒక్కరోజులో స్పందించే కలెక్టర్ తమ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక వెళ్లండని కలెక్టర్ అనడంతో ప్రభాకర్ రెడ్డి తన చేతిలోని పేపర్లను టేబుల్ పై విసిరేశారు. 


నన్నే గో అంటే సామాన్యుల పరిస్థితేంటి? 


"సజ్జలదిన్నె అనే గ్రామంలో ఒక ఎకరా 9 నుంచి 10 కోట్లు ధర పలుకుతుంది. ఈ గ్రామంలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని స్పందనలో ఫిర్యాదు చేశాను. అయితే అధికారులు పట్టించుకోవడంలేదు. ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే జాయింట్ కలెక్టర్ వద్ద సంతం అయ్యి, ఎమ్మార్వో వీఆర్వో సంతకం అయిపోతాయి. సాయంత్రానికి వెనక్కి వస్తుంది. ఇక్కడ నుంచి అమరావతి పంపిస్తారు. ఒక్కరోజులో ఫిర్యాదును పరిష్కరిస్తారు. ఈరోజు ప్రజలకు వచ్చిన పరిస్థితి రేపు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలకు వస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికీ న్యాయం జరగదు. ఏడు ఎకరాలు స్థలం అది ప్రభుత్వ భూమి. మాజీ ఎమ్మెల్యేగా వచ్చి భూఆక్రమణలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తే గో అంటున్నారు కలెక్టర్. నన్నే గో అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి. కొట్టిస్తారా?. కలెక్టర్ తన పదవికి అనర్హులు. స్పందన అని పేరు పెట్టారు కానీ ఒక్కరు స్పందించడంలేదు" -జేసీ ప్రభాకర్ రెడ్డి