Horse Riding Coaching: వాల్తేర్ డివిజన్ కేంద్రమైన విశాఖపట్నం రైల్వే స్పోర్ట్స్ మైదానాన్ని  గుర్రపు స్వారీ కోసం రెడీ చేశారు.  విశాఖపట్నం  రైల్వే ఫుట్‌బాల్ స్టేడియం సమీపంలోని నిర్దేశిత ఎన్‌క్లోజర్‌లో ఇప్పటికే గుర్రపు స్వారీ కోచింగ్ ప్రారంభించారు. ఈ శిక్షణ సదుపాయాన్ని డివిజినల్ రైల్వే మేనేజర్ అనుప్ సత్పతి ప్రారంభించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్  వాల్తేరు అధికారులు శిక్షణను పర్యవేక్షిస్తారు. 


ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడారు. రాష్ట్రంలో ఏ రైల్వే డివిజన్ లో లేని విధంగా విశాఖలో గుర్రపు స్వారీ శిక్షణ ఏర్పాట్లు చేశామని తెలిపారు. రైల్వే అధికారులతో పాటు నగరానికి చెందిన వారు ఇక్కడ శిక్షణ పొందవచ్చని చెప్పారు. ఈ శిక్షణ పిల్లలు, యువతలో ఉత్తేజాన్ని నింపుతుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి 6 వరకు శిక్షణ ఇస్తారని తెలిపారు. విశాఖలో వాతావరణం ప్రస్తుతం గుర్రపు స్వారీకి అనుకూలంగా ఉందని డీఆర్ ఎం అన్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది, నగర వాసులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 


గుర్రపు స్వారీ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ) ఏడి ఆర్ఎం   సుధీర్ కుమార్ గుప్తా,  (ఆపరేషన్స్) ఏడిఆర్ ఎం   మనోజ్ కుమార్ సాహూ, స్పోర్ట్స్ ఆఫీసర్  ప్రవీణ్ భాటి, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్  బి .అవినాష్  ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.