టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పేరును బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) గా మార్చే ప్రక్రియ కనీసం మరో నెల రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. తాజాగా టీఆర్ఎస్ పార్టీ ఓ బహిరంగ పత్రికా ప్రకటన విడుదల చేసింది. టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లుగా ఆ ప్రకటనలో పేర్కొంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ పేరుతో ఈ ప్రకటన జారీ అయింది. ఒకవేళ పార్టీ పేరు మార్చే విషయంలో ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, వాటిని ఈసీకి పంపాలని అందులో సూచించారు. అభ్యంతరాలను 30 రోజుల లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపవచ్చని పేర్కొన్నారు.


కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇలాంటి సందర్భాల్లో బహిరంగంగా పత్రికా ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి పేరు మార్చాలన్నా, లేదా ఏవైనా సవరణలు చేయాలన్నా జనాల నుంచి అభ్యంతరాలను పరిశీలించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రాంతీయ వార్తా పత్రికలతో పాటు, ఇంగ్లీషు పేపర్లలోనూ ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే కేంద్రం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తాజాగా గులాబీ పార్టీ బహిరంగ ప్రకటన ఇచ్చింది.




‘‘సాధారణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఎన్నికల సంఘం వద్ద నమోదైన రాజకీయ పార్టీ, అనగా తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రధాన కార్యాలయం: తెలంగాణ భవన్, రోడ్ నెంబర్ 10, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34, దాని పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చుటకు ప్రతిపాదిస్తున్నది. 


ప్రతిపాదిస్తున్న కొత్త పేరు పట్ల ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉంటే వాటికి గల కారణాలతో తమ అభ్యంతరమును సెక్రటరీ (పొలిటికల్ పార్టీ), ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోకా రోడ్, న్యూఢిల్లీ - 110001 కి ప్రచురణ నుంచి 30 రోజులలోగా పంపవలెను.’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశంతో కేసీఆర్ 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. ప‌లు రాష్ట్రాల నేత‌ల స‌మ‌క్షంలో కేసీఆర్ ఈ ప్రకటనను అక్టోబరు 5న చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.  టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ ఆ రోజు తెలంగాణ భవన్ లో ఆమోదించారు. దీంతో అక్టోబరు 5 మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించారు.


ముహుర్తం ప్రకారం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటన


తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం అక్టోబరు 5న తెలంగాణ భవన్ లో జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్‌ సభ్యులు, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు సహా 283 మంది కీలక ప్రతినిధులు భేటీకి హాజరయ్యారు. అలాగే సమావేశానికి పలు రాష్ట్రాల నేతలు సైతం హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని ప్రకటించారు. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో దీన్ని కీలక మలుపుగా అభివర్ణించారు. పార్టీ సర్వసభ్య సమావేశానికి హాజరైన పలు రాష్ట్రాల నేతల సమక్షంలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు.