కరోనా లాక్ డౌన్ అనంతరం భారత్ లో ఆన్ లైన్ గేమింగ్ మరింత ఊపందుకుంది. గతంలో పోల్చితే పెద్ద సంఖ్యలో పిల్లలు, పెద్దలు ఆన్ లైన్ గేమ్స్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ఆన్ లైన్ గేమ్స్ పై జీఎస్టీ ఎంత విధించాలని అనే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ చర్చిస్తోంది. నైపుణ్యం అవసరమయ్యే గేమ్‌ ల విషయంలో తక్కువ పన్ను ఉండేలా చూడాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సూచించాయి. ఈ నేపథ్యంలో  GST కౌన్సిల్ లా కమిటీ ప్రత్యేక పన్నుల రూపకల్పనను సులభతరం చేయడానికి 'గేమ్స్ ఆఫ్ స్కిల్',  'గేమ్స్ ఆఫ్ ఛాన్స్' నిర్వచనాలపై చర్చించింది. ఈ మేరకు బెంగళూరులో ఇండస్ట్రీ నిపుణులతో ప్యానెల్ సమావేశమైంది. వాస్తవానికి అన్ని రాష్ట్రాలు లా కమిటీలో భాగం కావు. అందుకే వీటి నిర్వచనంపై ముసాయిదా నివేదిక రూపొందిస్తోంది. ఆ నివేదికను అన్ని రాష్ట్రాల అభిప్రాయాల కోసం పంపిస్తుంది.


'గేమ్స్ ఆఫ్ స్కిల్'కు తక్కువ పన్ను విధించాలంటున్న రాష్ట్రాలు 


'గేమ్స్ ఆఫ్ స్కిల్'కు తక్కువ పన్ను అమలు చేయాలని  చాలా రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర GST అధికారులు వేర్వేరు పన్నుల రూపకల్పనపై ఆలోచిస్తున్నారు. 'గేమ్స్ ఆఫ్ స్కిల్'ను 'గేమ్స్ ఆఫ్ ఛాన్స్'తో సమానంగా పరిగణించరాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ గేమ్‌లపై GST  విధించడం అనేది గడిచిన సంవత్సర కాలంగా సంక్లిష్ట సమస్యగా మారింది. ఆయా గేమ్స్ కు సంబంధించి స్పష్టమైన నిర్వచనం లేనప్పుడు పన్ను ఎంత విధించాలి అనే విషయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఒకవేళ ఆన్‌లైన్ గేమ్ పోర్టల్‌లకు పన్ను నోటీసులు పంపినా.. కేసులు కోర్టుకు చేరే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 'గేమ్స్ ఆఫ్ స్కిల్'కు తక్కువ రేటుతో పన్ను విధించాలని గేమింగ్ ఇండస్ట్రీ డిమాండ్ చేస్తోంది. అందుకే ముందుగా  'గేమ్స్ ఆఫ్ స్కిల్',  'గేమ్స్ ఆఫ్ ఛాన్స్' నిర్వచనాన్ని ఖరారు చేసిన తర్వాతే పన్ను విధించాలని జీఎస్టీ లా కౌన్సిల్ నిర్ణయించింది. 


నివేదిక రూపొందిస్తున్న కేంద్ర మంత్రుల బృందం


ఈ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రుల బృందం (GoM) GST కౌన్సిల్‌కు ఒక నివేదికను సమర్పించాలనుకుంటున్నట్లు పీటీఐ వెల్లడించింది. ఇది చట్టబద్ధంగా సమర్థించదగినదిగా ఉండటంతో పాటు కోర్టులలో సవాలు చేసే అవకాశం ఉండదు. GoM తన నివేదికను ఖరారు చేసే ముందు అన్ని గేమింగ్ సంస్థల వాటాదారులను సంప్రదిస్తుంది. అయితే  గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత డిసెంబర్ నెలాఖరులోగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆన్‌ లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలపై పన్ను విధించడంపై GoM నివేదికపై కౌన్సిల్ చర్చిస్తుంది.


ఆన్లైన్ గేమింగ్ పై మరింత చర్చ జరగాలన్న GST కౌన్సిల్


జూన్‌లో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఆధ్వర్యంలోని మంత్రుల బృందం ఆన్‌లైన్ గేమింగ్ రంగంపై 28 శాతం పన్ను విధించాలని GST కౌన్సిల్‌కు సూచించింది. కౌన్సిల్ మాత్రం   ఆన్‌లైన్ గేమింగ్, కాసినోలపై పన్ను విధించడంపై మరింత చర్చించాల్సిందిగా GoMని కోరింది. ప్రస్తుతం, 'గేమ్స్ ఆఫ్ ఛాన్స్'పై 28 శాతం GST కొనసాగుతోంది. ఇందులో కొన్ని రకాల బెట్టింగ్/గ్యాంబ్లింగ్ కూడా ఉన్నాయి. అయితే, స్కిల్ గేమింగ్ రంగం 18 శాతం GST చెల్లిస్తుంది. భారతదేశంలోని ఆన్ లైన్ గేమర్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. COVID-19 లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ గేమింగ్ చాలా రెట్లు పెరిగింది.  KPMG నివేదిక ప్రకారం, ఆన్‌లైన్ గేమింగ్ రంగం 2021లో రూ. 13,600 కోట్ల నుంచి 2024-25 నాటికి రూ. 29,000 కోట్లకు పెరగబోతుంది.


Also Read: నెల రోజుల్లోగా అందుబాటులోకి ట్విట్టర్ ‘బ్లూ’ సబ్‌ స్క్రిప్షన్ సర్వీస్, ఎలన్ మస్క్ వెల్లడి!