Diabetes: మనదేశంలో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య ఏటికేటికి పెరిగిపోతోంది. ఇలాగే కొనసాగితే ప్రపంచంలో భారత్ డయాబెటిక్ క్యాపిటల్‌గా మారే అవకాశం ఉంది. ప్రపంచంలో చూసుకుంటే ప్రతి పది మంది పెద్దల్లో ఒకరు మధుమేహం బారిన పడినట్టు గుర్తించారు. ప్రపంచ జనాభాలో దాదాపు 51 కోట్ల మంది డయాబెటిక్ రోగులు ఉన్నట్టు లెక్క. ప్రస్తుతం మనదేశంలో ఉన్న జనాభాలో దాదాపు ఎనిమిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు అంచనా. ఈ సంఖ్య 2045 కల్లా పదమూడున్నర కోట్లకు చేరుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అంటే మధుమేహం సైలెంట్ కిల్లర్‌లా మారి ప్రజల్లో చేరి వారి ఆరోగ్యాన్ని పిప్పి చేస్తుంది. అందుకే మధుమేహం వచ్చాక జాగ్రత్తలు తీసుకునే కన్నా రాకుండానే చూసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు వైద్యులు.
రోజూ పెరుగు, చీజ్
కెనడాలోని మెక్ మాస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం పాల పదార్థాలు తీసుకోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బు, రక్తపోటు వంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ అధ్యయనం కోసం 21 దేశాలకు చెందిన లక్షన్నర మంది ఆహారపు అలవాట్లను అధ్యయనం చేశారు. అందులో పెరుగు వంటివి పదార్థాలు తీసుకున్న వారిలో మెటబాలిక్ సిండ్రోమ్ తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు... ఈ సిండ్రోమ్ విభాగంలోకే వస్తాయి. అంటే పెరుగు, చీజ్ వంటి పాల పదార్థాలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యమని తేలింది. అలాగని అధికంగా తింటే అవి ఎంతో హాని చేస్తాయి. మితంగా రోజూ తినడం వల్ల మధుమేహం రాకుండా అడ్డుకోవచ్చు.
రోజుకో గుడ్డు తినడం వల్ల లేదా కప్పు పెరుగు, కొంచెం చీజ్ తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుందని కూడా చెబుతున్నారు. వీటిపై ఇంకా లోతుగా అధ్యయనాలు జరుగుతున్నాయి. మధుమేహం రాకుండా ఉండాలంటే రోజూ వ్యాయామాలు కూడా చేయాలి. జంక్ ఫుడ్ మానేసి ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినాలి. రోజూ ఓ అరగంట పాటూ వాకింగ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డయాబెటిస్ రోగులకు ఆ రోగం అదుపులో ఉంటుంది, అదే రాని వారికైతే ఆ వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది.
తాజా పండ్లు, ఆకుపచ్చని కూరగాయలతో వండిన కూరలను తినాలి. రోజూ అరగ్లాసు పాలు, ఒక ఉడకబెట్టిన గుడ్డు తింటే ఎంతో మంచిది. చీజ్ రోజు తినడం వల్ల బరువు పెరగచ్చు అనకుంటే రెండు రోజులకోసారి కొంచెం తింటే మంచిది. ముఖ్యంగా చక్కెరతో చేసిన, మైదాతో చేసిన ఆహారాలను దూరం పెట్టాలి. ఈ రెండు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి.
Also read: పీడకలలు వస్తున్నాయా? తేలికగా తీసుకోవద్దు, వాటర్ధం ఇది కావచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.