Munugode Bypoll Result Effect on BJP: తెలంగాణలో కీలకంగా భావించిన సాగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 10 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీపై విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న బీజేపీకి ఈ ఫలితాలు ఓ విధంగా ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న తరుణంలో ఈ ఎన్నికలు బీజేపీ స్పీడ్ కు బ్రేక్ వేశాయా..? అంటే అంత ప్రభావం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మునుగోడు ఈ రిజల్ట్ తో బీజేపీలోకి జంప్ అవాలనుకునే లీడర్లు పునరాలోచిస్తారు. కానీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ మరో ఉప ఎన్నిక ఫలితంతో స్పష్టం చేసింది.
2023లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితం ఎదురైంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికలతో జోరు మీదున్న బీజేపీ... టీఆర్ఎస్ పై పైచేయి సాధించాలంటే ఎన్నికలు ఒక్కటే మార్గమని అనుకంది. అందుకే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి తీసుకుంది. అది కూడా ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయించి తమ పార్టీలో చేర్చుకున్నారు. కేంద్రం సపోర్ట్ తో సర్వశక్తులు ఒడ్డినా.. బీజేపీకి మునుగోడు ఓటర్లు విజయాన్ని అందించలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్... లెఫ్ట్ పార్టీల సపోర్ట్ తో గులాబీ జెండా ఉప ఎన్నికల్లో రెపరెపలాడింది.
బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టిన కేసీఆర్
ఈ విజయంతో సీఎం కేసీఆర్ బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టారు. ఎందుకంటే.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనుకుంటున్న తరుణంలో ఈ ఓటమితో ప్రజలు కాస్త డైలామాలో పడే అవకాశం ఉంది. అలాగే, కాంగ్రెస్, టీఆర్ఎస్ లో ఉండే అసంతృప్తి నేతలు బీజేపీలోకి జంప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న లీడర్లు కొందరైనా ఈ రిజల్ట్స్ తో పునరాలోచనలో పడే ఛాన్స్ ఉంది. హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ తన వ్యక్తిగత విలువ, పేరుతో గెలిచారని, దుబ్బాకలో రఘునందర్ రావు ఇమేజ్‌తోనే బీజేపీ గెలిచింది తప్ప.. క్షేత్రస్థాయిలో బీజేపీకి అంత ఓటింగ్ లేదు అని టీఆర్ఎస్ జనాల్లోకి తీసుకెళ్లినట్లైంది. దీంతో బీజేపీ వైపు ఆశగా చూస్తున్న వారి ఆలోచనలు తారుమారు కాకముందే కాషాయ నేతలు త్వరపడాలి.
ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓటమి చెందారు కానీ, బీజేపీ మాత్రం గెలిచింది. 2018లో జరిగిన ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లతో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆ సమయంలో బీజేపీ సాధించింది 8 శాతం ఓట్లు మాత్రమే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఓడిపోయి ఉండవచ్చు కానీ, బీజేపీ ఓటింగ్ శాతం బాగా పెరిగింది. మరోవైపు.. ఒక్క ఏడాదిలోనే ఎన్నికలు ఉండగా.. ఉపఎన్నికలకు సిద్ధమవ్వడానికి రాజగోపాల్ రెడ్డి రాజకీయాలు తెలియని వ్యక్తి కాదు. ఈ ఉపఎన్నికతో బీజేపీ పెద్దల మన్ననలు పొందవచ్చు. ఒకవేళ ఓడిపోయినా.. ఏడాదిలో మళ్లీ ఎన్నికలు వస్తాయి. మరోవైపు తన కారణంగా మునుగోడులో బీజేపీ పుంజుకుందని అధిష్టానానికి తెలియజేశారు. ఈ ఎన్నికల్లో సీఎం, రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలగాన్ని ఎదుర్కొని ఓడారన్న సింపతి ప్రజల్లో వస్తుంది అనే ప్లాన్ బీ తోనే ఎన్నికల బరిలో నిలిచారనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఈ ఎన్నిక ఫలితాలతో కాస్త డీలా పడినా, బీజేపీకి ఉపశమనం ఇచ్చే అంశం ఏంటంటే కాంగ్రెస్ కంచుకోటలోనూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది. 2018 తరువాత జరిగిన 5 ఉపఎన్నికల్లో నాగార్జున సాగర్, హుజుర్ నగర్ లో తప్ప మిగతా 3 చోట్ల టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు ఆదరించారు. దుబ్బాక, హుజురాబాద్ లలో రఘునందన్ రావు, ఈటల రాజేందర్ లను అక్కడి ఓటర్లు గెలిపించారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీకి ఇది మంచి బూస్టప్. కాంగ్రెస్ లోని అసంతృప్తులు, టీఆర్ఎస్ లోని రెబల్ లీడర్స్ కు బీజేపీనే ఆశాదీపంగా కనిపిస్తోంది.
ఇప్పటికే చాలా మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బీజేపీ లోకి జంప్ అయ్యారు. మరికొందరు కీలక నేతలు కమలం పెద్దలతో టచ్ లోనే ఉన్నారని బీజేపీ నేతలు సైతం అప్పుడప్పుడు ప్రస్తావిస్తుంటారు. దీంతో టీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే బీజేపీ తోనే అవుతుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఈ ఎన్నికలతో మరోసారి ఆ విషయం బలపడింది. 2023 ఎన్నికల ముందు వరకు ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీ అధికారంలోకి వస్తుందో లేదో చెప్పలేం కానీ, బలమైన పార్టీగా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.